📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగుగ్గిళ్లలో ‘ఉల్లాస్’ వయోజన విద్యా పరీక్ష

గుగ్గిళ్లలో ‘ఉల్లాస్’ వయోజన విద్యా పరీక్ష

📰 Generate e-Paper Clip

గుగ్గిళ్లలో ‘ఉల్లాస్’ వయోజన విద్యా పరీక్ష

అక్షరం నేర్చుకోవడానికి వయస్సు అడ్డుకాదు

చదువు ప్రతి ఒక్కరికీ అవసరం – సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య

బెజ్జంకి, సెప్టెంబర్ 27 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గుగ్గిళ్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఉల్లాస్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం వయోజన విద్యా పరీక్ష నిర్వహించారు. గ్రామంలో నిరక్షరాస్యతను నిర్మూలించాలనే లక్ష్యంతో మహిళా సంఘాల ఆధ్వర్యంలో వృద్ధులు, నిరక్షరాస్యులకు గత కొన్ని రోజులుగా అక్షర జ్ఞానం, లెక్కలు, సంతకం తదితర అంశాల్లో శిక్షణ అందించారు. శిక్షణ పొందిన సభ్యులకు ఆదివారం పరీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య హాజరై పరీక్ష రాసిన వృద్ధులు, నిరక్షరాస్యులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్షరం నేర్చుకోవడానికి వయస్సు అడ్డుకాదని, చదువు ప్రతి ఒక్కరికీ అవసరమని అన్నారు. వృద్ధులు, మహిళా సంఘాల సభ్యులు ఆసక్తితో శిక్షణ పొంది పరీక్ష రాయడం అభినందనీయమన్నారు.
ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా నిత్యావసర వస్తువులు, రోజువారీ జీవితంలో వినియోగించే వస్తువుల పేర్లు రాయించడం ద్వారా చదువు, అక్షర జ్ఞానంపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. అక్షరాలను గుర్తించడం, పదాలను చదవడం, లెక్కలు వేయడం, సంతకం చేయడం వంటి అంశాల్లో శిక్షణ అందించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా కృషి చేసినట్లు పేర్కొన్నారు.
గ్రామంలో నిరక్షరాస్యతను పూర్తిగా నిర్మూలించి ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని సర్పంచ్ ఆకాంక్షించారు. అక్షర జ్ఞానం ద్వారా ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు రోజువారీ జీవితంలో అవసరమైన విషయాలను స్వయంగా తెలుసుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. గ్రామాన్ని సంపూర్ణ అక్షరాస్యత దిశగా తీసుకెళ్లేందుకు మహిళా సంఘాలు, ప్రజలు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల అధ్యక్షురాలు వసంత, వీవోఏ భాగ్య, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.