*మామునూరు విమానాశ్రయానికి దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలి*
*తెలంగాణ తొలి అమరుడి త్యాగానికి సముచిత గౌరవం దక్కాలి – కడవెండి గ్రామ సర్పంచ్ భాషిపాక రాములు డిమాండ్*
జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 27(ప్రజావాణి):
తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో తొలి అమరుడిగా నిలిచిన దొడ్డి కొమురయ్య పేరును వరంగల్ మామునూరు విమానాశ్రయానికి పెట్టాలని కడవెండి గ్రామ సర్పంచ్ భాషిపాక రాములు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కడవెండి గ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లా చరిత్రలోనే కాకుండా తెలంగాణ ప్రజా ఉద్యమ చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగి ఉందని, ఇది పోరాటాల పురిటిగడ్డ అని అన్నారు.
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. నాటి దొరల పెత్తనం, భూస్వాముల అణచివేతలకు వ్యతిరేకంగా పేద ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు దొడ్డి కొమురయ్య అని కొనియాడారు.
ఆయన అమరత్వానికి కడవెండి గ్రామం సాక్ష్యంగా నిలిచిందని, ఆయన త్యాగాన్ని భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిపేందుకు ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకోవాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ త్యాగాలకు, పోరాటాలకు గుర్తింపు లభిస్తోందని, అందులో భాగంగానే త్వరలో ప్రారంభం కానున్న మామునూరు విమానాశ్రయానికి ‘దొడ్డి కొమురయ్య విమానాశ్రయం’ గా నామకరణం చేయడం ద్వారా ఆయన త్యాగానికి సముచిత గౌరవం లభిస్తుందని సర్పంచ్ రాములు అభిప్రాయపడ్డారు.
ఇలా చేయడం ద్వారా దేశ, విదేశాల నుండి వచ్చే ప్రయాణికులకు తెలంగాణ పోరాట చరిత్ర, దొడ్డి కొమురయ్య త్యాగం తెలుస్తుందని, యువతలో దేశభక్తి, తెలంగాణ అస్తిత్వ భావం పెంపొందుతుందని తెలిపారు.
ఈ డిమాండ్ కు కడవెండి గ్రామ ప్రజలతో పాటు గ్రామ మేధావులు, విద్యావంతులు, ఉద్యమకారులు, వివిధ ప్రజా సంఘాలు, ప్రజా ప్రతినిధులు పూర్తి మద్దతు తెలుపుతున్నారని సర్పంచ్ తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.

