మానుకోటను బిఆర్ఎస్ కంచుకోటగా మారుస్తాం..
బిఆర్ఎస్ పార్లమెంటరీ లీడర్ రవిచంద్ర
కేటీఆర్ సమక్షంలో ఇనుగుర్తి నుంచి బిఆర్ఎస్ లో చేరిక..
ప్రజావాణి,ఇనుగుర్తి: మహబూబాబాద్ నియోజకవర్గాన్ని బిఆర్ఎస్ కంచుకోటగా మారుస్తామని బిఆర్ఎస్ పార్లమెంటరీ నాయకుడు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు.
రాష్ట్రంలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులను చూసి అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పాలనను ఛీదరించుకుంటున్నారని చెప్పారు.ఎంపీ రవిచంద్ర స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు ఆ పార్టీని వీడి శనివారం హైదరాబాద్ తెలంగాణ భవన్ కు తరలివచ్చి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు.మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఇనుగుర్తి ఉప సర్పంచ్ సత్తూరి యాదగిరి,ఆయనతో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలకు కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎంపీ మాలోతు కవిత మాట్లాడారు,ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పూర్తిగా కుంటుపడిపోవడంతో నిరాశ చెందిన కరుడుగట్టిన కాంగ్రెస్ కుటుంబాలు ఆ పార్టీకి మూకుమ్మడిగా గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ లో చేరారన్నారు.ఇనుగుర్తికి ఘనమైన చరిత్ర ఉందని,కాకతీయులు కొంతకాలం ఇక్కడి నుంచే పాలన చేశారని,100 ఏండ్ల కిందటనే తెలుగు పత్రిక ప్రచురణ జరిగిందని తెలిపారు.దివంగత మాజీ ప్రధాని పీ.వీ.నర్సింహారావు తన చిన్నతనంలో ఇనుగుర్తిలోనే చదువుకున్నారని,మా ఊరు వాలీబాల్ క్రీడకు పేరుగాంచిందని, జాతీయ జట్టుకు వెంకటనారాయణ కెప్టెన్ గా వ్యవహరించారని చెప్పారు. మండల కేంద్రం ఎప్పుడో కావలసి ఉండగా,రాజకీయ కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదని,తనతో పాటు పార్టీ నాయకులు రవీందర్ రావు,కవిత, సత్యవతి రాథోడ్,శంకర్ నాయక్ తదితరులు విజ్ఞప్తి చేయడంతో మహానేత కేసీఆర్ తమ చిరకాల ఆకాంక్షను నెరవేర్చారన్నారు. కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
మానుకోటను బిఆర్ఎస్ కంచుకోటగా మారుస్తాం..
RELATED ARTICLES

