ధూల్మిట్ట పాఠశాల మరో ఘనత
జిల్లాస్థాయి యువ టూరిజం క్లబ్ పోటీల్లో మూడో స్థానం
మద్దూరు సెప్టెంబర్25, ప్రజా వాణి,
సిద్దిపేట జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ టూరిజం క్లబ్ జిల్లా స్థాయి పోటీల్లో ధూల్మిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మూడో స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది.జిల్లాలోని 78 పాఠశాలలు పాల్గొన్న ఈ పోటీల్లో ధూల్మిట్ట పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రదర్శనతో ప్రతిభ చాటారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.ఇందుకు కృషి చేసిన యువ టూరిజం క్లబ్ గైడ్ టీచర్లు,విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.
స్థానిక చరిత్ర,వారసత్వ సంపదతో పాటు మరుగునపడిన పర్యాటక ప్రదేశాలను వెలుగులోకి తీసుకురావడం,పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ఈ విజయానికి దోహదపడ్డాయని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ పాఠశాల ఉత్తమ ప్రతిభ కనబరిచి అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.

