*వేలం పాటకు భిన్నంగా.. లడ్డూకు లక్కీ ఛాన్స్!
*గల్లీక గణేష్ నిర్వాహకుల వినూత్న ప్రయోగం..
*నిమజ్జన వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ*
అమీన్‌పూర్, సెప్టెంబర్ 23 (ప్రజావాణి ప్రతినిధి): లడ్డూ కోసం వేలం పాట.. భారీ మొత్తంలో పోటీ.. ఎక్కువ ధర పలికిన వారికే లడ్డూ దక్కడం సాధారణం. అయితే
గల్లీక గణేష్ నిర్వాహకులు అందుకు భిన్నంగా ఆలోచించారు. డబ్బు పోటీకి తావులేకుండా లక్కీ డ్రా ద్వారా లడ్డూను అందించే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించి ఉత్సవానికి కొత్త శోభ తీసుకొచ్చారు. నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన ఈ లక్కీ డ్రాలో కంచనపల్లి నాగరాజు రెండో కుమార్తె పేరు రావడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. లడ్డూ కోసం వేలంలో భారీ మొత్తంలో డబ్బు వెచ్చించడం కంటే అందరికీ అవకాశం కల్పించేలా లక్కీ డ్రా నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యత, ఆనందాన్ని పెంచడంతో పాటు గణేష్ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తాయని పేర్కొన్నారు. గల్లీ క గణేష్ నిర్వాహకులు డి. యాదగిరి, ఎం. భాస్కర్, తలారి ప్రవీణ్, జి. శివ, తలారి సందీప్, కే. గోపి, మన్నె అరవింద్, దానుల్లా అజయ్ తదితరులు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాధారణంగా లడ్డూ కోసం ఎవరు ఎక్కువ మొత్తం చెల్లిస్తారనే పోటీకి బదులుగా.. ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించేలా లక్కీ డ్రా నిర్వహించడం మంచి ఆలోచనగా స్థానికులు ప్రశంసించారు. ఉత్సవం అంటే ఆనందాన్ని పంచుకోవడం.. ఆ ఆనందంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయడమే అసలైన పండుగ స్ఫూర్తి అన్నట్టుగా గల్లీ క గణేష్ నిర్వాహకులు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం నిలిచిందని పలువురు అభినందించారు.

