📄 ePaper
Epaper 2
Friday, September 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకరువు వస్తే బీఆర్‌ఎస్‌లో సంతోషమా..?

కరువు వస్తే బీఆర్‌ఎస్‌లో సంతోషమా..?

📰 Generate e-Paper Clip

కరువు వస్తే బీఆర్‌ఎస్‌లో సంతోషమా..?

ఎల్‌నినోను రాజకీయ ఆయుధంగా మార్చి విషప్రచారం

రైతు కన్నీటిలో ఓట్లు వెతకడం నీచ రాజకీయం: మంత్రి ఉత్తమ్‌

హుజూర్‌నగర్, సెప్టెంబర్ 24 (ప్రజావాణి):
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న వేళ రైతులకు భరోసా కల్పించాల్సిన ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ కరువు రావాలని, పంటలు ఎండిపోవాలని కోరుకుంటున్నట్లు వ్యవహరిస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రకృతి కారణంగా ఏర్పడిన వర్షపాత లోటును కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిస్తూ బీఆర్‌ఎస్‌ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల కష్టాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం బాధ్యతాయుతమైన ప్రతిపక్ష లక్షణం కాదన్నారు.

నేరేడుచర్ల మండలం మేడారం గ్రామంలో రూ.26.40 కోట్ల వ్యయంతో నిర్మించిన నేరేడుచర్ల–దూపాడు డబుల్‌ రోడ్డును మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రారంభించారు. రూ.20 లక్షలతో నిర్మించిన జానల్‌దిన్నె గ్రామపంచాయతీ భవనం, రూ.33 లక్షలతో నిర్మించిన నేరేడుచర్ల గ్రంథాలయ భవనాన్ని కూడా ప్రారంభించారు. మొత్తం రూ.26.93 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేశారు.

ఎల్‌నినో శాస్త్రీయ పరిణామం

ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ఎల్‌నినో కాంగ్రెస్‌ కార్యాలయంలో పుట్టిన పదం కాదని, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేసే శాస్త్రీయ పరిణామమన్నారు. పసిఫిక్‌ మహాసముద్ర ఉపరితల జలాలు సాధారణం కంటే వేడెక్కినప్పుడు ప్రపంచ వాతావరణ నమూనాల్లో మార్పులు వస్తాయని, భారత రుతుపవనాలపైనా ప్రభావం పడుతుందని తెలిపారు.

“ఆకాశంలో ఎల్‌నినో వర్షాలను అడ్డుకుంటే.. భూమిపై బీఆర్‌ఎస్‌ అబద్ధాల వరద పారిస్తోంది. రైతు పొలంలో పంట ఎండిపోతే ప్రభుత్వానికి బాధ కలుగుతుంది.. బీఆర్‌ఎస్‌కు మాత్రం రాజకీయ అవకాశం కనిపిస్తోంది. రైతు కన్నీటిలో ఓట్లు వెతకడం కంటే నీచమైన రాజకీయం మరొకటి ఉండదు” అని మంత్రి వ్యాఖ్యానించారు.

వర్షాలను ఎవరూ స్విచ్‌ వేసి కురిపించలేరని, అయితే అందుబాటులో ఉన్న ప్రతి నీటి చుక్కను కాపాడి ప్రజల అవసరాలకు వినియోగించడం ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేశారు. జలాశయాల్లో ఉన్న నీటిని పొదుపుగా వినియోగిస్తూ సాగు చేసిన పంటలను కాపాడటంతో పాటు వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం, నీటి నిల్వలపై ఒత్తిడి నెలకొన్నట్లు మంత్రి ఇటీవల అసెంబ్లీలోనూ వివరించారు.

కర్ణాటక సీఎంతో చర్చలు

జూరాల ఆయకట్టు కింద సాగు చేసిన పంటలను కాపాడేందుకు కర్ణాటక నుంచి నీటిని విడుదల చేయించే అంశంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో చర్చలు జరిపినట్లు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని, నీటి లభ్యతను పరిశీలించి సహకరించేందుకు సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.

సాగు చేసిన పంటలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అవసరమైన చోట నీటి విడుదల, ప్రత్యామ్నాయ నీటి వనరుల వినియోగం, జలాశయాల సమర్థ నిర్వహణపై అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. వేసవిలో ప్రజలకు మంచినీటి ఇబ్బందులు రాకుండా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.

ఆత్మీయ అనుబంధం

హైదరాబాద్‌లో ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ సన్నాహక సమావేశం ఉన్నప్పటికీ నేరేడుచర్ల–దూపాడు రహదారి ప్రారంభోత్సవానికి ప్రత్యేకంగా హాజరయ్యానని మంత్రి తెలిపారు. ఈ రహదారి నిర్మాణంతో నేరేడుచర్లతో పాటు పత్తేపురం, వైకుంఠపురం, రామలక్ష్మీపురం, మేడారం, బక్కయ్యగూడెం, దూపాడు గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని చెప్పారు.

ఈ ప్రాంతంతో తనకు రాజకీయ సంబంధం మాత్రమే కాదని, ప్రజలతో ఆత్మీయ అనుబంధం ఉందన్నారు. ప్రజల ఆదరాభిమానాలతోనే తాను ఆరు సార్లు శాసనసభకు, ఒకసారి లోక్‌సభకు ఎన్నికయ్యానని, వారి రుణాన్ని అభివృద్ధి పనులతో తీర్చుకుంటానని పేర్కొన్నారు.

కార్యకర్తలే పార్టీకి వెన్నెముక

పార్టీకి కార్యకర్తలు, నాయకులే వెన్నెముక అని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. వారి కృషి, ప్రజల విశ్వాసంతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. కోదాడలో నిర్వహించిన మెగా జాబ్‌ మేళా విజయవంతం కావడం యువతపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. రోడ్లు, భవనాల నిర్మాణంతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

గడ్డిపల్లిలో ఘన స్వాగతం

మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నేరేడుచర్ల మండలంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హెలికాప్టర్‌ ద్వారా గరిడేపల్లి మండలం గడ్డిపల్లికి చేరుకోగా స్థానిక కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వందలాది మంది కార్యకర్తలు, అభిమానులు హాజరై మంత్రికి స్వాగతం తెలిపారు. అనంతరం అక్కడి నుంచి కాన్వాయ్‌లో నేరేడుచర్ల మండలం మేడారానికి చేరుకుని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమాలు ముగిసిన అనంతరం తిరిగి గడ్డిపల్లికి చేరుకున్న మంత్రి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు బయలుదేరారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.