రూపా రెడ్డి హత్యకు నిరసనగా మేడ్చల్‌లో పాఠశాలల బంద్

మేడ్చల్: నల్గొండలోని నాగార్జున హైస్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి రూపా రెడ్డి దారుణ హత్యకు నిరసనగా మేడ్చల్‌లో శుక్రవారం ప్రైవేట్ పాఠశాలల బంద్ నిర్వహించనున్నారు. తెలంగాణ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం (TRSMA) పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మేడ్చల్ ప్రాంతీయ కమిటీ నాయకులు తెలిపారు.
హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తూ పాఠశాలల యాజమాన్యాలు, కరెస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు మేడ్చల్ కేంద్రంలో భారీ శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించి, అనంతరం రెండు నిమిషాల మౌనం పాటించి రూపా రెడ్డికి నివాళులర్పించనున్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి
రూపా రెడ్డి హత్యకు కారణమైన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని TRSMA నాయకులు డిమాండ్ చేశారు. విద్యాసంస్థల్లో పనిచేస్తున్న నిర్వాహకులు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులకు భద్రత కల్పించేలా ప్రభుత్వం తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ నిరసన కార్యక్రమంలో TRSMA మేడ్చల్ అధ్యక్షులు స్వామిదాసు, కార్యదర్శి రాధాకృష్ణ, ట్రెజరర్ మూర్తితో పాటు పలువురు పాఠశాలల కరెస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు పాల్గొననున్నారు. పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసనను విజయవంతం చేయాలని TRSMA నాయకులు పిలుపునిచ్చారు.
