పాత గోడలు, శిథిల నిర్మాణాల వద్ద పనులు చేయవద్దు
కార్మికుల భద్రతకు యజమానులే బాధ్యత వహించాలి: చిలువేరు స్వామి
పెద్దపల్లి జూలై 29 ప్రజావాణి:
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని భవన నిర్మాణ కార్మిక సమైక్య సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చిలువేరు స్వామి పిలుపునిచ్చారు. వర్షాల కారణంగా నిర్మాణ స్థలాల్లో అకస్మాత్తుగా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందున, ప్రతి ఒక్కరూ భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ముఖ్యంగా వర్షపు నీటికి బాగా తడిసి బలహీనపడిన పాత గోడలు, శిథిలావస్థకు చేరిన నిర్మాణాల వద్ద ఎలాంటి పనులూ చేయకూడదని హెచ్చరించారు. అలాంటి నిర్మాణాలు ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉన్నందున కార్మికులు అటువైపు వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు. అలాగే ఎత్తైన భవనాలపై పనిచేసే సమయంలో తప్పనిసరిగా రక్షణ పరికరాలు ధరించాలని, ప్రమాదకరమైన విద్యుత్ తీగలు, నీటితో నిండిన గుంతలు మరియు జారుడు ప్రదేశాల వద్ద ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.
ప్రాణ భద్రతే అందరికీ అత్యంత ముఖ్యమైనదని, అత్యవసర పరిస్థితులు మినహా భారీ వర్షాల సమయంలో పనులకు దూరంగా ఉండటమే శ్రేయస్కరమని చిలువేరు స్వామి స్పష్టం చేశారు. కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా గృహ నిర్మాణ యజమానులు, కాంట్రాక్టర్లు కూడా వారి భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నిర్మాణ ప్రాంతాల్లో అవసరమైన అన్ని రక్షణ చర్యలు చేపట్టిన తర్వాతే పనులు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.




