బెజ్జంకి, జూలై 22 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ఎల్లంపల్లి మోడల్ స్కూల్ లో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యాయామ ఉపాధ్యాయుడు (పీడీ) కనకారెడ్డిని సర్వీసు నుంచి తొలగించారు. విధుల్లో అలసత్వం వహించినందుకు పాఠశాల ప్రిన్సిపల్ మాలోత్ సంగీతను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ హైమావతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇటీవల విద్యార్థినులు పీడీ ప్రవర్తనపై ఫిర్యాదు చేయడంతో పాటు పాఠశాల ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టగా ఆరోపణలు ప్రాథమికంగా నిజమని తేలినట్లు సమాచారం. దీంతో పీడీపై కఠిన చర్యగా సేవల నుంచి తొలగింపు నిర్ణయం తీసుకున్నారు.అదేవిధంగా విద్యార్థుల భద్రత, పాఠశాల పరిపాలన పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించినందుకు ప్రిన్సిపల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారగా, విద్యార్థుల భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని అధికారులు స్పష్టం చేశారు.


