📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

తిరుమలాయపాలెం, ప్రజావాణి:రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార,పౌర సంబంధాలు మరియు గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుమలయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. గ్రామాలు, పట్టణాల్లో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి పేర్కొన్నారు. దమ్మాయిగూడెం గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం క్రమంగా అమలు చేస్తోందన్నారు.

ప్రభుత్వం ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ వంటి అనేక కార్యక్రమాలను అమలు చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ నెలలో మరో విడత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయనున్నామని, రాబోయే మూడు సంవత్సరాల్లో అర్హులందరికీ ఇళ్లు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా దమ్మాయిగూడెం గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు.

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడం, పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామపంచాయతీలకు కేటాయించిన నిధులను సమర్థంగా వినియోగించి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లూథర్ విల్సన్, ఎంపీడీవో సిలార్ సాహెబ్,  పంచాయతీరాజ్ ఎస్సీ వెంకట్ రెడ్డి, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, పాలేరు ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రామసహాయం నరేష్ రెడ్డి, మాజీ ఎంపీపీలు కొప్పుల అశోక్, బోడ మంగీలాల్, సర్పంచులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular