సిద్దిపేట, మార్చి 26, ప్రజావాణి
సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా చేపట్టిన ‘అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా గురువారం సిద్దిపేట మోడ్రన్ బస్ స్టాండ్ వద్ద వాహనదారులకు మరియు ప్రయాణికులకు ట్రాఫిక్ నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్.ఐ గోపాల్ రెడ్డి, ఎస్.ఐ ఉమేష్ ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ప్రయాణికులను ఉద్దేశించి మాట్లాడుతూ పలు కీలక సూచనలు చేశారు: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా ఐ.ఎస్.ఐ ముద్ర కలిగిన హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. “వేగం కన్నా ప్రాణం ముఖ్యం” అని గుర్తు చేస్తూ, పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడపవద్దని కోరారు. సిగ్నల్ జంపింగ్ చేయడం వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరిస్తూ, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను స్వచ్ఛందంగా పాటించాలని పిలుపునిచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే అనర్థాలను ప్రయాణికులకు వివరించారు. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించినప్పుడే ప్రమాద రహిత సిద్దిపేటను సాకారం చేసుకోవచ్చని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.




