మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మార్చ్ 08 (ప్రజావాణి):
రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో మణిదీప, వినాయక గ్రామ పరస్పర సహాయక పొదుపు, పరపతి సహకార సంఘం నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ…. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అనేక వినూత్న అవకాశాలను కల్పిస్తోందని తెలిపారు. మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు నడిపే బాధ్యతతో పాటు, పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ ప్లాంట్ల నిర్వహణను అప్పగిస్తున్నట్లు వివరించారు. రాజారాంపల్లి గ్రామంలో మహిళల స్వయం ఉపాధి కోసం మటన్ ప్రాసెసింగ్ యూనిట్ తో పాటు మరిన్ని పథకాలను తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు సంఘటితంగా ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామంలోని మహిళా సంఘం సభ్యులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేలా చొరవ తీసుకోవాలని స్థానిక సర్పంచ్ సంగ రమేష్‌ను మంత్రి కోరారు. మహిళల ఆర్థికాభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ బి.ఎస్. లత, డీఆర్డీఓ రఘువరన్, తహసీల్దార్ అనిల్ కుమార్, ఎంపీడీఓ కృపాకర్, ఉమ్మడి వెల్గటూర్ ఏఎంసీ చైర్మన్ గుండాటి గోపిక జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు మద్దుల గోపాల్ రెడ్డి, తాటిపర్తి శైలేందర్ రెడ్డి, సర్పంచ్ సంగ రమేష్, ఉపసర్పంచ్ మెరుగు జంపయ్య (జానీ)తో పాటు పలు గ్రామాల సర్పంచ్‌లు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు మరియు గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




