అభివృద్ధి పనులను అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారు
– ముల్కనూర్ సర్పంచ్ సాంబారి భారతమ్మ కొమురయ్య
మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి): కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వి.ఓ భవనం నిర్మాణానికి సంబంధించిన అంశంపై రాజకీయ నాయకుల మధ్య తీవ్ర విభేదాలు చెలరేగాయి. అధికార పార్టీ నాయకులు స్థల ఎంపికపై కఠినంగా అభ్యంతరం వ్యక్తం చేయగా, మరికొందరు వెంటనే పనులు ప్రారంభించాలని పట్టుబట్టారు. దీంతో సమావేశం వేడెక్కి ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని గ్రామ సభ పూర్తిగా రసాభాసగా మారింది.పరిస్థితి అదుపు తప్పేలా మారడంతో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. గ్రామాభివృద్ధి పనులు రాజకీయాలకు అతీతంగా అందరి సమ్మతితో ముందుకు తీసుకెళ్లాలని అధికారులు సూచించారు.ఈ సందర్భంగా సర్పంచ్ సాంబారి భారతమ్మ కొమురయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రామాభివృద్ధి కోసం చేపడుతున్న పనులను అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. ప్రజల ప్రయోజనాలను పక్కనపెట్టి రాజకీయ లాభాల కోసం అభివృద్ధి కార్యక్రమాలను నిలిపివేయడం దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు కొనసాగితే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. గ్రామ ప్రయోజనాల కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆమె కోరారు.




