📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పిఆర్సీ అమలు, ఆర్థిక బకాయిల సాధన కోసం పోరు తీవ్రతరం.*యుటిఎఫ్ కడప జిల్లా శాఖ హెచ్చరిక.,

పిఆర్సీ అమలు, ఆర్థిక బకాయిల సాధన కోసం పోరు తీవ్రతరం.*యుటిఎఫ్ కడప జిల్లా శాఖ హెచ్చరిక.,

📰 Generate e-Paper Clip

కడప జిల్లా శాఖ హెచ్చరిక*12వ పిఆర్సీ అమలు, ఆర్థిక బకాయిల చెల్లింపు, పెండింగ్ డిఏల విడుదల, సిపిఎస్ రద్దు తదితర డిమాండ్ల సాధన కోసం యుటిఎఫ్ ఆధ్వర్యంలో రణభేరి-3.0 పేరుతో పోరాటం తీవ్రతరం చేయనున్నట్లు యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబు లు హెచ్చరించారు. కడప లోని యూటీఎఫ్ భవన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ,ఉపాధ్యాయుల అండదండలతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. 12వ పిఆర్సీ గడువు ముగిసి మూడేళ్లు కావస్తున్నా పిఆర్సీ కమిషన్ ను ఏర్పాటు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం కనపరుస్తున్నదన్నారు.తాము అధికారంలోకి రాగానే ఉద్యోగులకు మెరుగైన వేతనాలను అమలు చేస్తామని ఆర్భాటంగా హామీలిచ్చిన కూటమి పెద్దలు, వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన పిఆర్సీ చైర్మన్ డాక్టర్.మన్మోహన్ సింగ్ తన బాధ్యతలకు రాజీనామా చేసి ఏడాదిన్నర కాలం కావస్తున్నా చైర్మన్ ను నియమించకుండా తాత్సారం చేయడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం రివర్స్ పిఆర్సీని అమలు చేసి,ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసగిస్తే, కూటమి ప్రభుత్వం సైతం అదే బాటలో నడుస్తున్నదని ఆరోపించారు.ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఆర్థిక బకాయిలను ఆరు నెలల్లోగా చెల్లిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం కేవలం 9 వేల కోట్ల రూపాయలను మాత్రమే చెల్లించి చేతులు దులుపుకుందన్నారు.ఇంకా ఉద్యోగులకు చెల్లించాల్సిన 30 వేల కోట్ల బకాయిల చెల్లింపులపై స్పష్టత లేదన్నారు. బకాయిలను ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.డిఏ లు సకాలంలో చెల్లించకపోతే ఉద్యోగులు ఎలా జీవిస్తారని ప్రతిపక్ష హోదాలో గగ్గోలు పెట్టిన కూటమి పెద్దలు మూడు డిఏ లను చెల్లించకుండా కాలయాపన చేయడం ఏంటని వారు నిలదీశారు.కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ రెండేళ్ల కాలంలో ఒకే ఒక్క డిఏ చెల్లింపు తప్ప ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనం చేకూర్చలేదన్నారు.సిపిఎస్ రద్దు,పాత పెన్షన్ విధానం అమలుపై కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు.సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని పదేపదే గొప్పగా ప్రకటించుకుంటున్న కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు.రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రెండేళ్లు వేచి చూశామని, ప్రభుత్వ విధానంలో మార్పు రాకపోతే ఇక పోరాటం తప్పదని వారు హెచ్చరించారు. ఇప్పటికే రణభేరి 1.0,రణభేరి 2.0 పేర్లతో పోరాటాలు చేపట్టామని,అయినప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేకపోవడం తగదన్నారు. ఉద్యోగుల సైతం ప్రభుత్వంలో,ప్రజలలో భాగమనే విషయాన్ని పాలకులు గుర్తెరగాలన్నారు.పిఆర్సీ అమలుకు నోచుకోకపోవడం, ఆర్థిక బకాయిల చెల్లింపులు పూర్తిస్థాయిలో జరగకపోవడంతో పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగ,ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి 12వ పిఆర్సీ ని ఏర్పాటు చేయాలని,పిఆర్సీ అమలయ్యే వరకు 29 శాతం మధ్యంతర భృతిని చెల్లించాలని,ఆర్థిక బకాయిల చెల్లింపులకు రోడ్ మ్యాప్ ప్రకటించి,నిర్ణీత గడువులోగా చెల్లించాలని,పెండింగ్ డిఏ లను విడుదల చేయడంతో పాటు,సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం మార్చి 24వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా తాలూకా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నామని, ఏప్రిల్ 1, 2 తేదీలలో జిల్లా కేంద్రాలలో ఏప్రిల్ 15 నుండి 19 వరకు రాష్ట్ర కేంద్రంలో నిరాహార దీక్షలు చేపట్టనున్నట్టు వారు వివరించారు. అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే ఏప్రిల్ 28వ తేదీ “ఛలో సెక్రటేరియట్” కార్యక్రమాన్ని నిర్వహించి సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. యుటిఎఫ్ చేపట్టిన రణభేరి పోరాట కార్యక్రమంలో ఉద్యోగ,ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో యుటిఎఫ్ జిల్లా ట్రెజరర్ కె.నరసింహారావు,జిల్లా కార్యదర్శులు సి.వి.రమణ,ఎస్.ఎజాస్ అహ్మద్,ఎ.డి.దేవ దత్తం, ఎ.వీరనారాయణ,సి.సుదర్శన్,జె.వి.సుబ్బారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డి.క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular