ధర్మపురిలో ట్రాఫిక్ ఆంక్షలు
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ధర్మపురి ఏప్రిల్ 1 (ప్రజావాణి):
ఏప్రిల్ 2వ తేదీ గురువారం రోజున హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ధర్మపురి పట్టణంలో పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకల అనంతరం తిరుగు ప్రయాణంలో భక్తులు భారీ సంఖ్యలో ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ధర్మపురి హనుమాన్ చౌరస్తా నుండి గుడికి వెళ్లే దారిలో, అలాగే గాంధీ చౌరస్తా నుండి నంది చౌరస్తా వరకు భక్తులు, స్థానిక ప్రజలు తమ వాహనాలను నిలపకూడదని. ఇప్పటికే నిబంధనలు అతిక్రమించి పార్కింగ్ చేసిన 13 వాహనాలకు మంగళవారం నాడు జరిమానా విధించినట్లు పోలీసులు వెల్లడించారు. ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతలో భాగంగా పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోబడునని, నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను రోడ్డుపైకి అనుమతించబడవని, అధిక శబ్దాలు చేసే సైలెన్సర్లను కలిగి ఉన్న వాహనాలపై చర్యలు ఉంటాయని, ఇప్పటికే ఇటువంటి మూడు వాహనాల సైలెన్సర్లను తొలగించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పట్టణ ప్రజలు, భక్తులు పోలీసులకు సహకరించాలని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మహేష్ కోరారు, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.



