తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 99వ జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని యాదవ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. అమరుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కాకరవాయి యాదవ సంఘం ఉపాధ్యక్షులు గుండాల వెంకన్న మాట్లాడుతూ..దొడ్డి కొమురయ్య రైతుల కోసం చేసిన త్యాగాలు, ఆయన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ముఖ్యంగా యువత సమాజ అభివృద్ధి కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గ్రామీణ స్థాయిలో సామాజిక ఐక్యతను పెంపొందించేందుకు యాదవ సంఘం పాత్ర మరింత బలోపేతం కావాలని పేర్కొన్నారు.ఈ సందర్భంగా యాదవ సంఘానికి ప్రత్యేక భవనం నిర్మాణం అత్యవసరమని తెలిపారు. సంఘ కార్యకలాపాలు నిర్వహించేందుకు, సమావేశాలు ఏర్పాటు చేసేందుకు, యువతకు మార్గదర్శక కార్యక్రమాలు నిర్వహించేందుకు భవనం అవసరమని వివరించారు. ఇందుకు సంబంధించి కాకరవాయి గ్రామపంచాయతీ పాలకవర్గానికి వినతి పత్రం సమర్పించారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా యాదవ సంఘ భవనం నిర్మాణానికి పాలకవర్గం సహకరించాలని కోరారు.కార్యక్రమానికి గుండెబోయిన ఎర్రయ్య అధ్యక్షత వహించారు. యాదవ పెద్దలు గొల్ల వీరబోయిన గట్టయ్య, గుండెబోయిన ముత్తయ్య తమ ప్రసంగాల్లో దొడ్డి కొమురయ్య పోరాట చరిత్రను స్మరించారు. గ్రామ సర్పంచ్ గూడూరు ఉపేందర్ మాట్లాడుతూ, సంఘ భవనం నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనను పరిశీలిస్తామని, గ్రామ ప్రజల అభివృద్ధికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఉప సర్పంచ్ కొత్తపల్లి వినోద శ్రీను కూడా సంఘ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.యాదవ కమిటీ సభ్యులు వీరబోయిన గణిత గంగయ్య, వీరబోయిన హేమలత దేవేందర్, దండ లింగయ్య, వీరబోయిన గణేష్ తదితరులు కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. కార్యక్రమంలో పాల్గొన్న యాదవులు పెద్ద సంఖ్యలో హాజరై అమరుడికి నివాళులు అర్పిస్తూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సంకల్పం వ్యక్తం చేశారు.గ్రామంలో ఐక్యత, సామాజిక చైతన్యం పెంపొందించే దిశగా ఇలాంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని స్థానికులు అభిప్రాయపడ్డారు.