*ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం.*
*మండల వ్యవసాయ అధికారి నారెడ్డి సీతారాంరెడ్డి.*
*తిరుమలాయపాలెం, ప్రజావాణి, మార్చి 12:*
తిరుమలాయపాలెం మండలం కొక్కిరేణి గ్రామంలో రైతులకు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన రైతు వెన్ను వెంకటేశ్వర్లు వ్యవసాయ క్షేత్రంలో ఆత్మ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల వ్యవసాయ అధికారి నారెడ్డి సీతారాంరెడ్డి హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయం అందించే పంటల వైపు కూడా దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగు రైతులకు దీర్ఘకాలికంగా మంచి లాభాలను అందించే పంటగా మారుతోందని ఆయన పేర్కొన్నారు.అలాగే ఆయిల్ పామ్ సాగులో భూమి ఎంపిక, మొక్కల నాటకం, నీటి పారుదల నిర్వహణ, ఎరువుల వినియోగం వంటి అంశాలపై రైతులకు సవివరంగా వివరించారు. ప్రభుత్వం ఈ పంట సాగుకు అందిస్తున్న సబ్సిడీలు, ప్రోత్సాహకాల గురించి కూడా అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో పాల్గొన్న రైతులు పంట సాగు పద్ధతులపై తమ సందేహాలను నిపుణులను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయంలో ఎల్లప్పుడూ ఒకే రకమైన పంటలపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తే మంచి లాభాలు పొందవచ్చని తెలిపారు. ఆయిల్ పామ్ సాగు ద్వారా తక్కువ ఖర్చుతో ఎకరాకు రూ.50 వేల నుండి లక్ష రూపాయల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కర్నాటి రాజేంద్రప్రసాద్, మాజీ జెడ్పిటిసి బెల్లం శ్రీను, ఎఫ్‌టీసీ ఏవో ఐ. భాస్కరరావు, హెచ్‌ఓ అపర్ణ, కాశీరావు, లక్ష్మీ, ప్రదీప్, దివ్య, సాధన, ఆత్మ సిబ్బంది మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.




