మార్కుక్, మార్చి 31, ప్రజావాణి
ప్రతి ఒక్కరూ క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలంటే రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని మార్కుక్ ఎస్ ఐ దామోదర్ కార్మికులకు
సూచించారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మార్కుక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కావేరి కంపెనీ కార్మికులకు సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మార్కుక్ ఎస్ ఐ దామోదర్, మాట్లాడుతూ, రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ నియమాలు ప్రతి ఒక్కరూ పాటించడం అత్యంత అవసరమన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపేవారు సీటుబెల్ట్ ధరించాలని సూచించారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం వంటి కారణాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.ప్రత్యేకంగా కంపెనీల్లో పనిచేసే కార్మికులు ఉదయం, రాత్రి షిఫ్ట్‌లకు వెళ్లే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాత్రి సమయంలో రిఫ్లెక్టర్ జాకెట్లు ధరించడం, వాహనాల హెడ్‌లైట్లు, ఇండికేటర్లు సరిగా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవాలని తెలిపారు. మొబైల్ ఫోన్ మాట్లాడుకుంటూ వాహనం నడపకూడదని హెచ్చరించారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద ప్రమాదాలను నివారించవచ్చని ఎస్సై పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కుక్ పోలీస్ సిబ్బంది, కంపెనీ యాజమాన్యం, కార్మికులు పాల్గొన్నారు.



