తిరుపతి జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్20) సత్యవేడు మండలంలో SEZ పేరుతో జరుగుతున్న బలవంతపు భూసేకరణకు నాలుగు గ్రామాల చెందిన 100 ల మంది రైతులు తీవ్రంగా వ్యతిరేకం వ్యక్తం చేశారు.రైతుల అనుమతి లేకుండా,తగిన నష్టపరిహారం ఇవ్వకుండా వేల ఎకరాల భూములను సేకరించడం రైతులకు జరిగిన పెద్ద అన్యాయమని వారు ఆరోపించారు.రైతు సుశీలకుమార్ రెడ్డి మాట్లాడుతూ,2006లో పారిశ్రామిక అభివృద్ధి పేరుతో సత్యవేడు పరిసర ప్రాంతాల్లో సుమారు వేళ్ళ ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించిందని,అందులో ఎక్కువ భాగం పేద రైతుల భూములేనని తెలిపారు.అప్పట్లో రైతులకు ఎకరానికి ఒక రేటు ఇచ్చారని,కానీ ప్రస్తుతం అదే భూముల విలువ కోట్ల రూపాయలకు చేరుకుందని పేర్కొన్నారు.రైతులను ఒత్తిడి చేసి సరైన చర్చలు లేకుండా భూములు తీసుకోవడం పూర్తిగా అన్యాయమని వారు విమర్శించారు. రైతులకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం వెంటనే గుర్తించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం న్యాయం చేసి,తగిన పరిహారం మరియు పునరావాసం కల్పించాలని కోరారు.అలాగే ఈ విషయంపై సత్యవేడు మండల తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ,తమ సమస్యలను వెల్లడించేందుకు గ్రామ సభ నిర్వహించాలని కోరారు.సమస్య పరిష్కారం అయ్యే వరకు రెవెన్యూ సిబ్బంది ఎలాంటి సర్వేలు చేపట్టకూడదని వారు డిమాండ్ చేశారు.అదే విధంగా పూతకు వచ్చిన మామిడి తోటలను బలవంతంగా నరికివేయడం తీవ్ర అన్యాయమని రైతుల జీవనోపాధిపై ప్రభావం పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని నాలుగు గ్రామాల రైతులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో విజయ శంకర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీరామచంద్రారెడ్డి, రాజాప్రతాప్ రెడ్డి,రవిరెడ్డి,ప్రసాద్ రెడ్డి,రజినీకాంత్,మనోజ్, మురళీనాయుడు,ధనంజయ్ నాయుడు,మధురెడ్డి,భాస్కర్ రెడ్డి,రగునాథ్ రెడ్డి,జయశంకర్ రెడ్డి,నాలుగు గ్రామాలకు చెందిన రైతులు,గ్రామ పెద్దలు మరియు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.