ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
పేదలకు మజ్జిగ పంపిణీ
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మార్చ్
తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు మిన్నంటాయి. తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు, పేద ప్రజల ఆశాజ్యోతి నందమూరి తారకరామారావు స్మృత్యర్థం పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. నాడు రాజకీయాల్లో పెను మార్పులు తీసుకువస్తూ ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన కేవలం తొమ్మిది నెలల్లోనే ప్రభంజనం సృష్టించి అధికారంలోకి రావడం ఒక అద్భుతమని నాయకులు కొనియాడారు. “కూడు, గూడు, గుడ్డ” అనే నినాదంతో సామాన్యుడి కనీస అవసరాలే ధ్యేయంగా ఆయన సాగించిన పాలన ఇప్పటికీ చిరస్మరణీయమన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను, ముఖ్యంగా అణగారిన వర్గాలను రాజకీయ చైతన్యవంతులుగా తీర్చిదిద్దిన ఘనత ఎన్టీఆర్ దేనని కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు. ఆయన వేసిన పునాదులే నేటికీ తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి దిక్సూచిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాం పల్లిలో ఎండపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాయచ్చు సదాశివ్ గుప్తా ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా, మానవతా దృక్పథంతో పేద ప్రజలకు, బాటసారులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పేదలకు సేవ చేయడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా వారు చాటిచెప్పారు. ఈ కార్యక్రమంలో ఎండపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాయచ్చు సదాశివ్ గుప్తా, సముద్రాల రమేష్ గుప్తా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లడ్డు, రవికిరణ్ గుప్తా, సంతోష్ గుప్తా, లక్ష్మణ్ గుప్తా, అంజయ్య గౌడ్, మడప సత్యనారాయణ, రాజయ్య, మల్లయ్య, చంద్రయ్య, ఆంజనేయులు చారి, భూషణం తదితరులు పాల్గొన్నారు.