సిరిసిల్లలో గాంధీ విగ్రహం కనిపించకుండా ప్లెక్సీలు…
వివాదంగా మారిన వాసవి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ ఏర్పాట్లు
పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందుల భయం
రాజన్న సిరిసిల్ల / ప్రజావాణి
సిరిసిల్ల పట్టణంలో రేపు ప్రారంభంకానున్న వాసవి వస్త్రాలయ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం నేపథ్యంలో పట్టణమంతా భారీగా ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడం వివాదానికి దారితీసింది. ముఖ్యంగా పట్టణంలోని ప్రధాన కూడలిలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో విగ్రహం పూర్తిగా కనిపించకుండా పోయింది.
జాతీయ నాయకుడి విగ్రహాన్ని కప్పివేసే విధంగా ప్లెక్సీలు ఏర్పాటు చేయడం సరైంది కాదని స్థానిక ప్రజలు మరియు సామాజిక వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాంధీ విగ్రహం వద్ద వ్యాపార ప్రకటనలు ఏర్పాటు చేయడం జాతీయ నాయకుడిని అవమానించే చర్యగా భావిస్తున్నామని పలువురు పేర్కొన్నారు.

మాల్ ప్రారంభోత్సవం కోసం భారీ స్థాయిలో అలంకరణలు, ఆహ్వాన ఏర్పాట్లు జరుగుతున్నప్పటికీ ప్రజా ప్రదేశాల్లో నిబంధనలు పాటించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా విగ్రహాల వద్ద ప్లెక్సీలు ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని స్థానికులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, వాసవి షాపింగ్ మాల్ వద్ద సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడం కూడా స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. పట్టణంలోని ప్రధాన రహదారి పక్కనే మాల్ ఉండటంతో వాహనాలు రోడ్డుపైనే పార్క్ చేసే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని, దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వ్యాపారులు మరియు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై మున్సిపల్ అధికారులు స్పందించి గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ప్లెక్సీలను తొలగించడంతో పాటు మాల్ వద్ద పార్కింగ్ ఏర్పాట్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రేపటి ప్రారంభోత్సవానికి ముందు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.