50%సబ్సిడీపై గొర్రెల ఫామ్స్ కేటాయించాలి..
జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి అశోక్
ప్రజావాణి,ఇనుగుర్తి: నిరుద్యోగులుగా ఉన్న గొర్రెల మేకల పెంపకం దారుల కుటుంబాలకు చెందిన యువతకు 50 శాతం సబ్సిడీపై గొర్రెల ఫామ్స్ కేటాయించాలని జి. ఎం. పి. ఎస్ జిల్లా కార్యదర్శి బొల్లం అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర సంఘం పిలుపుమేరకు జిల్లా కమిటీ సూచనతో జిఎంపిఎస్ మండల అధ్యక్షులు చిన్నాల కట్టమల్లు యాదవ్ ఆధ్వర్యంలో మండలంలోని చిన్న ముప్పారం గ్రామంలో గొర్రెల పెంపకం దారుల స్థితిగతులపై ఆదివారం సర్వే నిర్వహించారు. దీనికి అశోక్ హాజరై గొర్ల కాపర్ల పరిస్థితి, అక్కడ ఉన్న కుటుంబాల ఆర్థిక, సామాజిక ,రాజకీయ పరిస్థితిని అడిగి తెలుసు కున్నారు.
గ్రామంలో యాదవుల కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని యువత డిగ్రీలు, పీజీలు చేసి ప్రభుత్వ ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉన్నారని,వారికి ప్రభుత్వం నుండి సహకారం లేకపోవడంతో ఏదో ఒక పని చేసి జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెల పెంపకం వృత్తి చేపట్టాలని ఉన్నప్పటికీ ఆర్థిక స్తోమత లేక, మేత కోసం సరైన పచ్చికబైళ్ళు, భూములు లేకపోవడంతో వృత్తిలో కొనసాగ లేక పోతున్నారన్నారు. ప్రభుత్వం సబ్సిడీపై రుణాలు అందజేసి యువతను ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో నర్ర సుధాకర్,రాజు, అనీల్,నరసింహ,నర్ర అశోక్, జక్కుల ఉపకర్,సురబోయిన యాకన్న,నర్ర నరేష్,కొట్టం అశోక్,అనిల్,శ్రీను,జక్కుల హరీష్,నర్ర వెంకన్న, యాకాంబ్రం, లింగన్న తదితరులు పాల్గొన్నారు.