prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 November 2026, 12:14 am Digital Edition : upendar jerupothula JANAGON

లంబాడీ హక్కుల సాధనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలి..! ఎల్ ఎచ్ పి ఎస్

డిమాండ్లు పరిష్కరించకుంటే డిసెంబర్ లో ఛలో హైదరాబాద్, జనవరి 2027లో ఛలో ఢిల్లీ – మహా ధర్నా

 

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 29 (ప్రజావాణి): లంబాడీ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, రాజ్యాంగబద్ధమైన హక్కులను కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని లంబాడీ హక్కుల పోరాట సమితి (ఎల్ ఎచ్ పి ఎస్) రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది.

జనగామలో హైదరాబాద్ రోడ్డులోని విజయ మినీ కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం ఎల్ ఎచ్ పి ఎస్ రాష్ట్ర, జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన
ఈ సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి డా. నరేందర్ పవార్ అధ్యక్షత వహించారు. జాతీయ అధ్యక్షులు దాస్ రాం నాయక్, వైటిడిఏ సభ్యులు, టీపీసీసీ సభ్యులు, లంబాడీ సమాజ సీనియర్ రాష్ట్ర నాయకులు డా. లక్ష్మీనారాయణ నాయక్, రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లు ప్రకాష్ రాథోడ్, అజ్మిర సమ్మయ్య నాయక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, వివిధ జిల్లాలు, మండలాల నాయకులు హాజరై లంబాడీ సమాజ సమస్యలు, హక్కుల సాధనకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు.

ఎస్టీ రిజర్వేషన్లను 7.5 శాతం నుంచి 14 శాతానికి పెంచాలని, గోర్ బోలి భాషకు రాజ్యాంగ గుర్తింపు కల్పించి 8వ షెడ్యూల్‌లో చేర్చాలని, తెలంగాణలో అమలవుతున్న 10 శాతం ఎస్టీ రిజర్వేషన్లకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించే దిశగా వాటిని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని సమావేశం డిమాండ్ చేసింది.

ఎస్టీ లు సాగు చేస్తున్న పోడు, లావణి, సీలింగ్ భూములకు పూర్తి హక్కులతో కూడిన పట్టాలు మంజూరు చేయాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో 100 శాతం రిజర్వేషన్ల అమలుకు చర్యలు తీసుకోవాలని, తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక తండాల అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేయాలని, టీ-ప్రైడ్ పథకం కింద పెండింగ్ సబ్సిడీ నిధులను వెంటనే విడుదల చేయాలని, టీచర్ పదోన్నతుల విషయంలో ఎస్సి , ఎస్టీ ఉద్యోగులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తీర్మానించింది.

సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఎల్ ఎచ్ పి ఎస్ జాతీయ, రాష్ట్ర కమిటీల ప్రతినిధులు త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కేంద్ర, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రులను కలిసి వినతిపత్రం సమర్పించనున్నట్లు నాయకులు తెలిపారు.

డిమాండ్లు నెరవేర్చకుంటే డిసెంబర్‌లో ఛలో హైదరాబాద్, జనవరి 2027లో ఛలో ఢిల్లీ – మహా ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది.