prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 November 2026, 11:32 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

టీడీపీ బలోపేతమే లక్ష్యంగా.. బద్వేల్ ఇన్‌చార్జిని కలిసిన చింతలపల్లి నాయకులు

పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలి నాయకుల అభిప్రాయం

కడప జిల్లా,బద్వేల్,నవంబర్ 29(ప్రజావాణి) బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి మంచూరి సూర్యనారాయణరెడ్డిని చింతలపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు,నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ, శాలువాతో ఘనంగా సత్కరించారు.ఏపీ స్టేట్ రోడ్డు డెవలప్‌మెంట్ డైరెక్టర్ సాధనకారి రంతు ఆధ్వర్యంలో చింతలపల్లి గ్రామానికి చెందిన నూతన సర్పంచ్ గంధం భాస్కర్, ఉపసర్పంచ్ చెన్నయ్యతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికల్లో నూతన ప్రజాప్రతినిధులుగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో పార్టీ పెద్దలను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు,అభినందనలు స్వీకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ సందర్భంగా మంచూరి సూర్యనారాయణరెడ్డిని నాయకులు శాలువాతో సత్కరించి తమ అభిమానాన్ని,గౌరవాన్ని చాటుకున్నారు.చింతలపల్లి గ్రామంలో పార్టీ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నట్లు తెలిపారు.గ్రామ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తామని నూతన సర్పంచ్ గంధం భాస్కర్, ఉపసర్పంచ్ చెన్నయ్య పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిసింది. గ్రామాల్లో నెలకొన్న స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడం నూతన పాలకవర్గం ప్రధాన బాధ్యతగా ఉండాలని నాయకులు అభిప్రాయపడ్డారు.అలాగే చింతలపల్లి గ్రామ అభివృద్ధి,మౌలిక వసతుల కల్పన, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడం వంటి అంశాలపై నూతన పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారించాలని ఈ భేటీలో ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు.బద్వేల్ నియోజకవర్గ టీడీపీ నాయకత్వంతో గ్రామస్థాయి నాయకులు,ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా ముందుకు సాగడం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో చింతలపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.