రైతు నాయకుడికి కీలక పదవి దక్కేనా
ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 28
రైతు నాయకుడికి కీలక పదవి దక్కేనా
మిర్యాలగూడ కాంగ్రెస్ లో ఆసక్తికర చర్చ
మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం
పార్టీకి అంకితభావంతో సేవలు
మాజీ మంత్రి జానారెడ్డి సహా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థాయి నేతల అండదండలు అదనపు బలం
మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై ముదిరెడ్డి నర్సిరెడ్డి గురి
మిర్యాలగూడ, నియోజకవర్గం మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరిని వరించనుందనే అంశం కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారుతోంది. ఈ పదవిని ఆశిస్తున్న వారిలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, నల్లగొండ జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, పార్టీకి చేసిన సేవలు, ప్రజాప్రతినిధిగా పనిచేసిన అనుభవంతో పాటు జిల్లాలోని కీలక కాంగ్రెస్ నాయకులతో ఉన్న రాజకీయ సంబంధాలు ఆయనకు అదనపు బలంగా మారుతున్నాయనే చర్చ సాగుతోంది. 1992–1996 మధ్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నర్సిరెడ్డి, 1997–2002 వరకు మిర్యాలగూడలోని అప్పలమ్మ చెరువు వాటర్ యూజర్స్ అసోసియేషన్ చైర్మన్‌గా పనిచేశారు. 2003–2009 వరకు నల్లగొండ జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా, 2010–2014 వరకు డీసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం 2014 నుంచి 2024 వరకు మిర్యాలగూడ మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా పదేళ్ల పాటు ప్రజాప్రతినిధిగా కొనసాగారు. ప్రస్తుతం 2020 నుంచి నల్లగొండ జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అండదండలు.. అదనపు రాజకీయ బలం
ముదిరెడ్డి నర్సిరెడ్డి రాజకీయ ప్రస్థానానికి తోడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కీలక కాంగ్రెస్ నేతల అండదండలు ఆయనకు అదనపు బలంగా నిలుస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కుందూరు జానారెడ్డి ఆశీస్సులతో పాటు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ వంటి ముఖ్య నాయకుల మద్దతు లభిస్తే ఆయనకు రాజకీయంగా మరింత కలిసి వచ్చే అవకాశముందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రైతు సమస్యలపై పనిచేస్తున్న కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఆయనకు ఉన్న అనుభవం వ్యవసాయ మార్కెట్ కమిటీ బాధ్యతల నిర్వహణకు ఉపయోగపడుతుందని అనుచరులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ కోసం విద్యార్థి దశ నుంచి పనిచేస్తూ వివిధ హోదాల్లో సేవలందించిన నాయకుడికి తగిన గుర్తింపు కల్పించాలనే వాదన కూడా వినిపిస్తోంది.
అనుభవానికా.. రాజకీయ సమీకరణాలకా ప్రాధాన్యత
మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపికలో పార్టీ విధేయత, సీనియారిటీ, సామాజిక సమీకరణాలు, స్థానిక రాజకీయ పరిస్థితులు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో ముదిరెడ్డి నర్సిరెడ్డికి అవకాశం కల్పిస్తే పార్టీ కోసం సుదీర్ఘకాలంగా పనిచేసిన నాయకుడికి సముచిత గుర్తింపు లభించినట్లవుతుందని ఆయన అనుచరులు భావిస్తున్నారు. మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం.. పదేళ్ల కౌన్సిలర్‌గా ప్రజాసేవ.. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు.. జిల్లాలోని కీలక నేతలతో రాజకీయ అనుబంధం.. ఈ అంశాలన్నీ కలిసివస్తే మిర్యాలగూడ మార్కెట్ కమిటీ పీఠంపై ముదిరెడ్డి నర్సిరెడ్డి ఆశలు ఫలిస్తాయా.. కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.