prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 November 2026, 12:03 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

‘ప్రజావాణి’ కథనానికి స్పందన: ఆలయం ముందు అన్నదానాలకు ఈవో బ్రేక్!

ఆలయ ముఖద్వారం వద్ద కాకుండా బయట పక్కన టెంట్ వేసుకుని నిర్వహించుకోవాలని ఆదేశం

ఎక్కడపడితే అక్కడ చెత్త వేయొద్దు.. ప్రత్యేక డస్ట్‌బిన్ ఏర్పాటు చేసి వ్యర్థాలను దూరంగా తీసుకెళ్లి కాల్చివేయాలి

వెంకటాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ పరిశుభ్రతపై ఈవో కఠిన నిబంధనలు.. భక్తుల హర్షం

 

వెంకటాపురం (నూగురు), నవంబర్ 29 (ప్రజావాణి):

ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదానం పేరుతో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు, పారిశుద్ధ్య లోపంపై ‘ప్రజావాణి’లో ప్రచురితమైన కథనానికి దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి (ఈవో) తక్షణమే స్పందించారు. ఆలయ పవిత్రత, పరిశుభ్రతను కాపాడేందుకు కఠిన నిబంధనలు విధిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఆలయం ముందు వద్దు.. బయట పక్కనే నిర్వహించాలి!

ఇకపై ఆలయం ముందు భాగంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించకూడదని ఈవో స్పష్టం చేశారు. అన్నదానం చేయాలనుకునే దాతలు ఆలయానికి బయట పక్కన ప్రత్యేకంగా టెంట్ వేసుకుని నిర్వహించుకోవాలని సూచించారు. దీనివల్ల ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉంటుందని, ఆలయ ఆవరణ శుభ్రంగా ఉంటుందని పేర్కొన్నారు.

డస్ట్‌బిన్ తప్పనిసరి.. వ్యర్థాలను దూరంగా తీసుకెళ్లి కాల్చివేయాలి

అన్నదానం ముగిసిన తర్వాత తిన్న ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులను ఆలయ పరిసరాల్లో ఎక్కడపడితే అక్కడ పారబోయకూడదని ఈవో హెచ్చరించారు. అన్నదానం నిర్వహించే వారే ప్రత్యేకంగా డస్ట్‌బిన్ (చెత్త కుండీ) ఏర్పాటు చేయాలని, భక్తులు తిన్న ప్లేట్లను అందులోనే వేసేలా చూడాలని ఆదేశించారు. సేకరించిన ఆ వ్యర్థాలను ఆలయ సమీపంలో వదిలేయకుండా దూరంగా తీసుకెళ్లి పూర్తిగా కాల్చివేయాలని నిర్వాహకులకు తేల్చి చెప్పారు.  గత కొన్ని వారాలుగా ఆలయ ప్రహరీ గోడ పక్కనే ప్లేట్లు, చెత్త గుట్టలుగా పేరుకుపోవడంపై ‘ప్రజావాణి’ కథనం వెలువడగానే ఈవో స్పందించి పక్కా నిబంధనలు పెట్టడం పట్ల స్థానికులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యను వెలుగులోకి తెచ్చి పరిష్కారానికి కృషి చేసిన ‘ప్రజావాణి’కి మండల ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.