prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 November 2026, 7:22 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

పూలే ఆశయాలను తుంగలో తొక్కుతున్న పాలకులు.. వారి విధానాలను ప్రతిఘటించాలి….ఘట్‌కేసర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే 136వ వర్ధంతి

ఘట్‌కేసర్, నవంబర్ 28: సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం మహాత్మా జ్యోతిబా పూలే చేసిన కృషి ఆదర్శంగా నిలుస్తుందని, ఆయన ఆశయాలకు విరుద్ధంగా సాగుతున్న పాలకుల విధానాలను ప్రతిఘటించాలని సీపీఎం మండల కార్యదర్శి ఎన్. సబిత, సీనియర్ నాయకులు చింతల యాదయ్య పిలుపునిచ్చారు.

శనివారం ఘట్‌కేసర్‌లోని సీఐటీయూ కార్యాలయంలో సీపీఎం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే 136వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. పూలే దంపతులు అందరికీ విద్య అందించాలనే లక్ష్యంతో జీవితాంతం కృషి చేశారని గుర్తుచేశారు. అయితే నేటి బీజేపీ ప్రభుత్వం జాతీయ విద్యా విధానం పేరుతో పేదలకు విద్యను దూరం చేసే విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు. ఆధిపత్య మనువాద భావజాలం కొనసాగుతున్నంతకాలం దేశంలో సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదని పేర్కొన్నారు.

జ్యోతిరావు పూలే ఎన్నో సామాజిక పోరాటాలు నిర్వహించి సమానత్వం, విద్య, హక్కుల కోసం కృషి చేశారని, ఆయన స్ఫూర్తితో నేటి యువత, మేధావులు, ప్రజలు సామాజిక అన్యాయాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. బీజేపీ పాలనలో మధ్యయుగాల నాటి భావజాలాన్ని ప్రజలపై రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని, విద్య కాషాయీకరణతో పాటు దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలపై దాడులు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయని, మహిళలపై అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యురాలు కుడుకుంట్ల అలివేలు, బి. సునీత, దేవి, రజిత, సంజన, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.