prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 November 2026, 7:31 am Digital Edition : upendar jerupothula JANAGON

పూలే, అంబేద్కర్ ఆశయాలే మనకు దారి.. ఇరుగు మహేందర్

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 28 (ప్రజావాణి): సమసమాజ స్థాపన కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు ఇరుగు మహేందర్ ఆధ్వర్యంలో శనివారం జనగామ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం ముందు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఇరుగు మహేందర్ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యాభివృద్ధికి పూలే చేసిన కృషి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని అన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా బాలికల కోసం పాఠశాలను స్థాపించి, అక్షర జ్యోతిని వెలిగించిన మహానుభావుడని కొనియాడారు.

నేటికీ సమాజంలో కొనసాగుతున్న అసమానతలను రూపుమాపడానికి బహుజనులంతా పూలే, అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగాలని, రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు మడిపడిగ చంద్రశేఖర్, జెరిపోతుల మల్లయ్య, తాండ్ర అఖిల్, చిలుముల అర్జున్, స్వామి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.