prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 November 2026, 10:22 am Digital Edition : PRAJA VANI

సాయంత్రం బస్సు ఏదీ..? మూడు గ్రామాల ప్రజలకు ప్రయాణ కష్టాలు

సాయంత్రం బస్సు ఏదీ..? మూడు గ్రామాల ప్రజలకు ప్రయాణ కష్టాలు!
ఉదయం 9:30 గంటలకే ఆర్టీసీ బస్సు.. సాయంత్రం రాకపోవడంతో ప్రయాణికుల అవస్థలు
విద్యార్థులు, రోగులు, ఉద్యోగులకు తప్పని ఇబ్బందులు.. సాయంత్రం 6 గంటలకైనా బస్సు నడపాలని ప్రజల డిమాండ్
కూసుమంచి నవంబర్ 28 (మన ప్రజావాణి) ప్రతినిధి:
గ్రామీణ ప్రాంతాలకు ప్రజా రవాణా సౌకర్యం కల్పించాల్సిన ఆర్టీసీ బస్సులే అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పోచారం, కిష్టాపురం, చిన్న పోచారం గ్రామాల ప్రజలకు సాయంత్రం వేళ బస్సు సౌకర్యం లేకపోవడం ప్రయాణ కష్టాలకు కారణమవుతోంది. ప్రతిరోజూ ఉదయం సుమారు 9:30 గంటలకు పోచారం గ్రామానికి వచ్చే ఆర్టీసీ బస్సు తిరిగి సాయంత్రం గ్రామానికి రాకపోవడంతో మూడు గ్రామాల ప్రజలు రాకపోకలకు ప్రైవేటు వాహనాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.
విద్యార్థులకు తప్పని ఇక్కట్లు..
పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు సాయంత్రం తిరిగి తమ గ్రామాలకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో సమయానికి ఇళ్లకు చేరుకోలేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, రోజువారీ పనుల నిమిత్తం బయటకు వెళ్లే కూలీలు సైతం రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు.
రోగుల పరిస్థితి మరీ దయనీయం..
జిల్లా కేంద్రంలోని ఆసుపత్రులకు వైద్య పరీక్షలు, చికిత్సల కోసం వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చే రోగులు బస్సు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుండటంతో అదనపు ఆర్థిక భారం పడుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాయంత్రం 6 గంటలకైనా బస్సు నడపాలి..
ఉదయం 9:30 గంటలకు పోచారం గ్రామానికి బస్సు వస్తున్న నేపథ్యంలో తిరుగు ప్రయాణంలోనూ సాయంత్రం 6 గంటల నుంచి 6:30 గంటల మధ్య మరో ట్రిప్పును ఏర్పాటు చేస్తే మూడు గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని స్థానికులు సూచిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి సాయంత్రం బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని మూడు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజా రవాణా సౌకర్యం కల్పించడంలో జాప్యం చేయకుండా అధికారులు తక్షణమే స్పందించి ప్రయాణ కష్టాలకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.