*రేషన్‌లో నాశిరకం సన్న బియ్యం… పౌరసరఫరాల శాఖ నిద్రపోతోందా….?*
రాయికల్, నవంబర్ 28 (ప్రజావాణి):
పేదల కడుపు నింపడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పథకం అమలు తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చౌక ధరల దుకాణాల్లో పంపిణీ అవుతున్న బియ్యం నాణ్యత లేకపోవడంతో వేలాది పేద కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ పరిస్థితికి పౌరసరఫరాల శాఖ పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు.బియ్యంలో నూక శాతం అధికంగా ఉండడం, పురుగు పట్టిన గింజలు, దుమ్ము, రాళ్లు, దుర్వాసన, వండితే ముద్దగా మారడం వంటి సమస్యలు ప్రతి దుకాణంలోనూ కనిపిస్తున్నాయి. దీంతో పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు తినలేక ఇబ్బంది పడుతున్నారు. పేద కుటుంబాలు రేషన్ బియ్యం తెచ్చుకుని కూడా బయట మార్కెట్లో డబ్బు పెట్టి బియ్యం కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ప్రభుత్వ పథకం ఉద్దేశ్యాన్ని దెబ్బతీస్తోంది.మిల్లర్ల నుంచి బియ్యం సేకరణ, నిల్వ, రవాణా, పంపిణీ ప్రతి దశలో నాణ్యతా తనిఖీలు జరగాల్సి ఉంది. కానీ క్షేత్ర స్థాయిలో తనిఖీలు జరగకపోవడం వల్లే నాశిరకం బియ్యం పేదలకు చేరుతోందని సామాజిక వేత్తలు చెబుతున్నారు. మంచి బియ్యం బయటి మార్కెట్లో అమ్ముకుని, నాశిరకం బియ్యాన్ని రేషన్‌కు తరలిస్తున్నారనే ఆరోపణలపై విచారణ జరపాల్సిన అవసరం ఉంది.ఈ పరిస్థితికి పౌరసరఫరాల శాఖ బాధ్యత వహించాల్సిందేనని సమాజంలోని అన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. బియ్యం నాణ్యతను పరీక్షించకుండా దుకాణాలకు పంపడం, ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోకపోవడం, తనిఖీ నివేదికలను ప్రజలకు వెల్లడించకపోవడం వల్లే మిల్లర్లలో నిర్లక్ష్యం పెరిగిపోయిందని అంటున్నారు. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి పేదల కోసం తెస్తున్న పథకం మధ్యలోనే నీరుగారిపోతుంటే అధికారులు చూస్తూ ఊరుకోవడం సరికాదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.పేదలకు నిజంగా లబ్ధి జరగాలంటే పౌరసరఫరాల శాఖ వెంటనే సమగ్ర చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రతి మండలంలో రేషన్ దుకాణాల్లో బియ్యం నమూనాలను సేకరించి నాణ్యతా పరీక్షలు చేయాలి. నాశిరకం బియ్యం సరఫరా చేసిన మిల్లర్లపై జరిమానా విధించడంతో పాటు లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకోవాలి. నాణ్యత లేని బియ్యం వస్తే ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసేందుకు మండల స్థాయిలో ఫిర్యాదు కేంద్రం, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి. ప్రతి నెలా తనిఖీ నివేదికలను గ్రామ పంచాయతీలో ప్రదర్శించాలి. గ్రామ స్థాయిలో రేషన్ కమిటీలను బలోపేతం చేసి, బియ్యం పంపిణీకి ముందే మహిళా సంఘాలు, స్థానిక ప్రజాప్రతినిధులతో తనిఖీ చేయించాలి. నాణ్యత లేని బియ్యం వస్తే వెంటనే వెనక్కి పంపించి మంచి బియ్యం తెప్పించే విధానం అమలు చేయాలి.ప్రభుత్వ పథకం విజయవంతం కావాలంటే కేవలం బియ్యం పంపిణీ చేస్తే సరిపోదు, ఆ బియ్యం పేదోడి కంచంలో తినదగిన అన్నంగా మారాలి. పౌరసరఫరాల శాఖ ఇకనైనా మేల్కొని, మిల్లర్లపై కఠిన నిఘా పెట్టి, నాణ్యమైన సన్న బియ్యం పేదలకు అందేలా చర్యలు తీసుకుంటేనే ఈ పథకానికి నిజమైన అర్థం వస్తుందని, పేదల కడుపు నిండుతుందని ప్రజలు ఆశిస్తున్నారు.