prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 November 2026, 9:25 am Digital Edition : PRAJA VANI

మంచిర్యాల పట్టణంలో అర్ధరాత్రి పోలీసుల ఆకస్మిక తనిఖీలు

*మంచిర్యాల పట్టణంలో అర్ధరాత్రి పోలీసుల ఆకస్మిక తనిఖీలు*

*నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ప్రత్యేక డ్రంక్ & డ్రైవ్*

*అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిరంతర నిఘా: మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్*

*మన ప్రజావాణి*
*మంచిర్యాల జిల్లా*

రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణంలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించడం లక్ష్యంగా పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తా, బైపాస్ రోడ్డు, తెలంగాణ తల్లి విగ్రహం జంక్షన్, బస్టాండ్ ప్రాంతంతో పాటు ప్రధాన కూడళ్లలో పోలీసులు ఏకకాలంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మంచిర్యాల పట్టణ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రంక్ & డ్రైవ్ నిర్వహించి, వాహనదారుల వివరాలు, డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ మరియు ఇతర సంబంధిత ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ తనిఖీలను మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.ఈ సందర్భంగా అర్ధరాత్రి సమయంలో రోడ్లపై అనవసరంగా సంచరిస్తున్న యువతతో పాటు డ్రంక్ & డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులను స్వయంగా విచారించారు.వారు రాత్రి వేళల్లో బయటకు రావడానికి గల కారణాలను తెలుసుకుని, అవసరమైన వివరాలను నమోదు చేయించారు.
అనుమానాస్పద వ్యక్తులు,వాహనాల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించి,రాత్రి వేళల్లో నేరాలకు అవకాశం లేకుండా నిరంతరం నిఘా కొనసాగించాలని పోలీసు అధికారులను డీసీపీ ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై ఎలాంటి ఉపేక్ష చూపవద్దని సూచించారు.ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, మద్యం సేవించి వాహనాలు నడపకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్, ఎస్సైలు ఆది మధుసూదన్, ఆంజనేయులు, శివకేశవులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు..