బాలికల హక్కులు, మహిళా రక్షణ చట్టాలపై అవగాహన
హక్కులపై అవగాహనతో ఆత్మవిశ్వాసంగా ముందుకు సాగాలి: ఏసీడీపీఓ రోజా రాణి
ప్రజా వాణి రిపోర్టర్ నరసింహులపేట నవంబర్ 27:
బాలికలు తమ హక్కులపై అవగాహన కలిగి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఏసీడీపీఓ సీహెచ్ రోజా రాణి సూచించారు. నర్సింహులపేట బాలికల కళాశాలలో మరిపెడ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో బాలికల హక్కులు, బాలల హక్కులు, మహిళా రక్షణ చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థినులకు విద్యా హక్కు, సమానత్వం, గౌరవంగా జీవించే హక్కులతో పాటు గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై వివరించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా, వేధింపులకు గురిచేసినా ధైర్యంగా ఎదిరించి నమ్మకమైన పెద్దలకు తెలియజేయాలని సూచించారు.పోక్సో చట్టం–2012, పోష్ చట్టం–2013 గురించి వివరిస్తూ బాలలపై లైంగిక వేధింపులు, పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులను అరికట్టేందుకు చట్టపరమైన రక్షణలు ఉన్నాయని తెలిపారు. మహిళలు, బాలికలు వేధింపుల విషయంలో మౌనంగా ఉండకుండా ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జీ. కృష్ణారెడ్డి, నర్సింహులపేట జూనియర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పాల్గొని విద్యార్థినులకు పలు సూచనలు చేశారు. బాలికల భద్రత, గౌరవం, సమాన అవకాశాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.