ఫోర్జరీ సంతకాలు – కోటి నిధులు – మౌనం వీడని అధికారులు!
ములుగు జిల్లా ప్రజావాణి
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో రెండు పంచాయతీల్లో ఒకే తరహా అవినీతి కథ బయటపడింది.
బూర్గుపేటలో ఉప సర్పంచ్ జంబుల రాజమణి సంతకం ఫోర్జరీ చేసి 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి రూ.2 లక్షలు డ్రా చేశారన్నది ప్రధాన ఆరోపణ.
లక్ష్మీదేవీపేటలోనూ అదే తీరు – చేయని పనులకు బిల్లులు, ఫోర్జరీ సంతకాలు, నిధుల దారి మళ్లింపు జరిగిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
లక్ష్మీదేవీపేటకు గత 11 నెలల్లో కోటి రూపాయల నిధులు వచ్చాయి, కానీ అవి కాగితాలకే పరిమితమయ్యాయని బీరెల్లి స్వప్న నిలదీశారు.
గ్రామంలో ఏ పని జరిగింది, ఎంత ఖర్చు చేశారు, మిగిలిన డబ్బు ఎక్కడ ఉంది అనే లెక్కలు ప్రజల ముందు పెట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
రూ.1.25 లక్షలు దాటిన పనులకు చెక్ మెజర్ మెంట్ లేకుండా, రూ.5 లక్షలు దాటిన పనులకు ఉన్నతాధికారుల ధ్రువీకరణ లేకుండా బిల్లులు విడుదల చేశారన్నది మరో సంచలన ఆరోపణ.
పేపర్లో వరుస కథనాలు రావడంతో కలెక్టర్ ఆదేశంతో డీపీఓ బూర్గుపేట పంచాయతీని ఆకస్మిక తనిఖీ చేశారు.
ఎంబీ బుక్స్, బ్యాంక్ స్టేట్ మెంట్లు, చెక్ రిజిస్టర్లు, బిల్లులు అన్నీ స్వాధీనం చేసుకున్నారు.
కానీ ఆ తర్వాత నివేదిక ఎక్కడ ఆగిపోయిందో, రికార్డులు కలెక్టర్ కు చేరాయో లేదో ఎవరికీ తెలియడం లేదు.
సామాన్యుడు ఫోర్జరీ చేస్తే వెంటనే క్రిమినల్ కేసు, సర్పంచ్ చేస్తే మాత్రం రాజీ ప్రయత్నాలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
మంత్రి సీతక్క అండ ఉంటే అధికారులకు పని లేదా అని బీఆర్ఎస్ నాయకులు సూటిగా ప్రశ్నించారు.
ఫోర్జరీ రుజువైతే పదవి పోవడంతో పాటు జైలు శిక్ష తప్పదని తెలిసే విచారణను సాగదీస్తున్నారన్న అనుమానం బలంగా ఉంది.
జిల్లాలో 171 పంచాయతీల్లో 146 కి పాలకవర్గాలు ఉండగా, ఇదే తీరు అన్ని చోట్లా జరుగుతోందా అన్న భయం ప్రజల్లో నెలకొంది.
గ్రామసభలో లెక్కలు చెప్పకుండా, ప్రజలకు తెలియకుండా నిధులు తీయడం ప్రజాస్వామ్యానికి తీవ్ర అవమానమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఒక్క గ్రామం కథ కాదు, ఏజెన్సీ ప్రాంత ప్రజల నమ్మకాన్ని చంపే కుట్ర అని నాయకులు మండిపడ్డారు.
కలెక్టర్ స్వయంగా జోక్యం చేసుకుని నివేదిక బయటపెట్టి, దోషులపై క్రిమినల్ కేసు పెట్టే వరకు పోరాటం ఆగదని బూర్గుపేట, లక్ష్మీదేవీపేట ప్రజలు హెచ్చరిస్తున్నారు.