పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి శ్రీనివాస్
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి నవంబర్ 28
పెద్దపల్లి: మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను ఆచరణలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని అమర్ నగర్‌లో ఉన్న ఆయన విగ్రహానికి బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బొడ్డుపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పూలే సమాజంలో నెలకొన్న కులవివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, మహిళల విద్యాభివృద్ధికి ఆయన చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.
మహిళలకు విద్య అందించేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని, సమాజంలోని ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, విద్యావకాశాలు కల్పించాలనే ఆయన ఆశయాలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పూలే ఆశయ సాధనకు కృషి చేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల హక్కుల పరిరక్షణకు, సామాజిక న్యాయం సాధనకు అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు భూతగడ్డ సంపత్, యూత్ కాంగ్రెస్ నాయకుడు బొంకురి అవినాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరకొండ రాజు, భూషణవేణి సురేష్ గౌడ్, కౌన్సిలర్ దొడ్డుపల్లి జగదీష్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.