prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 November 2026, 6:02 pm Digital Edition : PRAJA VANI

తెలంగాణ రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తే సహించేది లేదు

తెలంగాణ రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తే సహించేది లేదు!

నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు

బీజేపీకి, తెలంగాణ బీజేపీ ఎంపీలకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సూటి ప్రశ్న

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి నవంబర్ 28

పెద్దపల్లి: దేశ అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం కీలకమైన ఆర్థిక భాగస్వామ్యం అందిస్తున్నప్పటికీ, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి ప్రాజెక్టుల కేటాయింపుల్లో తగిన న్యాయం జరగడం లేదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచితే దక్షిణ భారత రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

ఈ అంశంపై బీజేపీతో పాటు తెలంగాణకు చెందిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని వంశీకృష్ణ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల గొంతుకను పార్లమెంటులో బలహీనపరిచే చర్యలను ఎలా సమర్థిస్తారని నిలదీశారు. దేశంలో తెలంగాణకు సమాన హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.

దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో తెలంగాణ సుమారు 5 శాతం వాటాను అందిస్తున్నప్పటికీ, అభివృద్ధి నిధుల కేటాయింపుల్లో రాష్ట్రానికి సుమారు 2 శాతం వాటా మాత్రమే దక్కుతోందని ఆయన ప్రస్తావించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు అధిక ఆదాయం అందిస్తున్న రాష్ట్రాలకు నిధుల కేటాయింపుల్లోనూ సముచిత న్యాయం జరగాలని స్పష్టం చేశారు.

నియోజకవర్గాల పునర్విభజనలో జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా నష్టం కలగకుండా చూడాలని కోరారు. తెలంగాణ ప్రయోజనాలు, దక్షిణాది రాష్ట్రాల హక్కులు, సమాన రాజకీయ ప్రాతినిధ్యం పరిరక్షణ కోసం పార్లమెంటులో తమ పోరాటం కొనసాగుతుందని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ పడకుండా తెలంగాణ ప్రజల గొంతుకగా పార్లమెంటులో నిలబడతామని ఆయన పేర్కొన్నారు.