*సర్పంచ్ ఫిర్యాదుతో వీడీసీ అధ్యక్షుడిపై కేసు నమోదు*
*జిల్లా ఎస్పీ ప్రజావాణిలో ఫిర్యాదు.. ఎస్పీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కుంటాల పోలీసులు*
నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో, భైంసా, నవంబర్ 27:–
గ్రామ పంచాయతీ విధుల నిర్వహణలో జోక్యం చేసుకుంటూ, తనను దుర్భాషలాడి విధులకు ఆటంకం కలిగించారంటూ కల్లూరు గ్రామ సర్పంచ్ పెంటవార్ దశరథ్ చేసిన ఫిర్యాదుతో కుంటాల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో కల్లూరు గ్రామానికి చెందిన వీడీసీ అధ్యక్షుడు ఎంగందుల భారత్ భూషణ్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 221, 296(b) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు రికార్డుల్లో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. నవంబర్ 24న కల్లూరు గ్రామంలో జాతీయ రహదారి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్‌కు నీటి ట్యాంకర్ అవసరం కావడంతో గ్రామ శ్మశానవాటికలోని బోర్‌వెల్ నుంచి నీటిని తీసుకెళ్లాలని సర్పంచ్ సూచించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పంచాయతీ కార్మికుడు పాసుల సంజీవ్ నీటిని ట్యాంకర్‌లో నింపుతుండగా అక్కడికి వచ్చిన వీడీసీ అధ్యక్షుడు భారత్ భూషణ్ అభ్యంతరం వ్యక్తం చేసి నీటిని నింపకుండా అడ్డుకున్నట్లు ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ దశరథ్ అక్కడికి చేరుకుని ప్రశ్నించగా, తనను అసభ్య పదజాలంతో దూషించారని, పంచాయతీ కార్మికుడిని కూడా దుర్భాషలాడారని ఫిర్యాదులో వివరించారు. సదరు బోర్‌వెల్ మోటారు గ్రామ పంచాయతీకి సంబంధించినదని, విద్యుత్ బిల్లులు సైతం పంచాయతీ నుంచే చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలోనూ తన విధుల నిర్వహణకు ఆటంకాలు కలిగించినట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో నవంబర్ 25న భైంసాలో జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సర్పంచ్ దశరథ్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై ఎస్పీ ఆదేశాల మేరకు కుంటాల పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 121/2026గా కేసు నమోదు చేశారు. ఎస్సై గుగ్లోత్ నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గ్రామ పంచాయతీ ఆస్తుల వినియోగం, ప్రజాప్రతినిధుల విధుల నిర్వహణకు సంబంధించిన ఈ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు వెల్లడికావాల్సి ఉంది.