జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 26 (ప్రజావాణి):రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర కూడా లభించకపోవడంతో దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
గురువారం పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణంలోని అన్నారం రోడ్డులో భద్రకాళి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో తాము పండించిన ధాన్యాన్ని ఇప్పటికే దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన బోనస్ వస్తుందన్న ఆశతో రోజుల తరబడి ఎదురుచూసినా ప్రయోజనం లేకుండా పోయిందని, దాదాపు రెండు పంటలకు సంబంధించిన బోనస్ ఇప్పటికీ తమ ఖాతాల్లో జమ కాలేదని తెలిపారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు రైతులకు అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. రైతులకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించి, ఆ హామీని సకాలంలో అమలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర పొందాల్సిన రైతులు ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవడం బాధాకరమన్నారు.
రైతు భరోసా పథకం అమలులోనూ రైతులకు ఎదురుచూపులే మిగులుతున్నాయని, రైతు రుణమాఫీ విషయంలోనూ అనేక మంది రైతులకు పూర్తిస్థాయిలో ప్రయోజనం అందలేదని ఆరోపించారు. రైతులు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని పంట పండిస్తే చివరకు పంటను అమ్ముకునేందుకు కూడా ఇబ్బందులు పడాల్సి రావడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు.
రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న బోనస్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, రైతు భరోసా, రుణమాఫీ పథకాల ప్రయోజనాలను అర్హులైన రైతులందరికీ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా చర్యలు తీసుకుని రైతులకు మద్దతు ధర అందేలా చూడాలని కోరారు.