ఘట్కేసర్, నవంబర్ 26: భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు ఘన నివాళులర్పిస్తూ రాజ్యాంగ పరిరక్షణకు పోరాడుతామని సీపీఐ కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు. ఘట్కేసర్ అన్నోజిగూడ ఆర్జీ కాలనీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్ మాట్లాడుతూ, కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులకు, రైతులు, కార్మికులు, విద్యార్థుల హక్కులకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిని దేశద్రోహులుగా, అర్బన్ నక్సల్స్‌గా ముద్ర వేస్తూ వారి గొంతుకలను అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువకులు అనేక ఉద్యమాలు నిర్వహించారని పేర్కొన్నారు.
రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని, అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటాలు కొనసాగిస్తామని అన్నారు. ఇకపై ‘మోదీ హటావో.. దేశ్ బచావో’ నినాదంతో ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
సీపీఎం మండల కార్యదర్శి ఎన్. సబిత మాట్లాడుతూ సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన గొప్ప ఆయుధం భారత రాజ్యాంగమని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ శాఖ కార్యదర్శి బి. శ్రీనివాస్, కేఎల్ మహేంద్ర నగర్ కాలనీ అధ్యక్షుడు ఎన్. రాములు గౌడ్, అన్నోజిగూడ శాఖ కార్యదర్శి లొట్టి సరిత, మండల నాయకులు బి. రాజు గౌడ్, పి. ఎల్లయ్య, ప్రమీల, భిక్షపతి, శివ, ఎండి. మౌలానా, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.