*ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసై….బెట్టింగ్ అప్పులు తీర్చేందుకు వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీ.*
*చోరీ చేసిన బంగారు గొలుసు , ఒక ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్ స్వాధీనం నిందితుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు.*
*వివరాలు వెల్లడించిన వేములవాడ డిఎస్పీ శ్రీనివాసులు..*
నవంబర్ 27 మన సమగ్ర ప్రజావాణి ప్రతినిధి కోనరావుపేట:
కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన ముష్ణం వెంకటేష్, తండ్రి పేరు: అంజయ్య, వయస్సు: 29 సంవత్సరాలు అనే వ్యక్తి హైదరాబాద్‌లో ఐటీఐ పూర్తి చేసి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈక్రమంలో వెంకటేష్ ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడి మొదట కొంత డబ్బు గెలిచినప్పటికీ, అనంతరం పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడు. దాంతో హైదరాబాద్ నుండి స్వంత గ్రామానికి వచ్చి ఇక్కడే వుంటున్నాడు. ఇక్కడ కూడా బెట్టింగ్ కోసం తన భార్య బంగారు నగలను తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులు కూడా బెట్టింగ్ లో పెట్టి పోగొట్టుకున్నాడు, అంతేకాకుండా తెలిసిన వారి వద్ద అబద్ధాలు చెప్పి అప్పులు తీసుకొని ఆ డబ్బులను కూడా బెట్టింగ్‌లో పోగొట్టుకున్నాడు. ఈక్రమంలో పోగొట్టుకున్న డబ్బులను తిరిగి సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనానికి పథకం వేయగా తనకు బంధువులైన కోదురుపాక గ్రామానికి చెందిన బొంగొని రాజవ్వ (అమ్మమ్మ) ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు తెలుసుకొని, ఆమె మెడలో బంగారు గొలుసు ఉండటాన్ని గమనించి దొంగలించాలనుకున్నాడు.తేదీ 18-11-2026న సాయంత్రం తన పల్సర్ బైక్‌పై కోదురుపాకకు చేరుకొని, ముందస్తు ప్రణాళిక ప్రకారం మంకీ క్యాప్ ధరించి రాజవ్వ ఇంట్లోకి ప్రవేశించి గుర్తు పట్టకుండా వెంటనే లైట్ ఆఫ్ చేసి అనంతరం ఆమె నోటికి తువ్వాలు అడ్డుపెట్టి బెదిరించి, మెడలో ఉన్న బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు. రాజవ్వ కొడుకు లక్ష్మీనారాయణ ఇచ్చిన పిర్యాదు మేరకు బోయినపల్లి ఎస్.ఐ రమాకాంత్ కేసు నమోదు చేయడం జరిగింది. వేములవాడ రూరల్ సిఐ శ్రీనివాస్ దర్యాప్తు ప్రారంభించగా సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందుతుని నవంబర్ 27 ఉదయం సుమారు 11 గంటల సమయంలో కోదురుపాక ఎక్స్ రోడ్ అదుపులోకి తీసుకొని అతని వద్ద చోరీ చేసిన 10 గ్రాముల బంగారు గొలుసు, ఒక బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండ్ కి తరలించినట్లు డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడి ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, అప్పుల ఊబిలో కూరుకుపోయి నేరాలకు పాల్పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. యువత ఆన్లైన్ బెట్టింగ్‌కు దూరంగా ఉండాలని, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో తమ జీవితాలను నేరాల వైపు మళ్లించుకోవద్దని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
*నిధుతుణ్ణి పట్టుకోవడంలో కృషి చేసిన వేములవాడ రూరల్ సిఐ శ్రీనివాస్, ఎస్.ఐ రమాకాంత్, సిబ్బంది ధర్మతేజ, కాశిం, శ్రీధర్, యాకుబ్ లను డిఎస్పీ గారు అభినందించారు.*