prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 7:39 pm Digital Edition : UPENDHAR JANAGON

సేవే పరమావధిగా లయన్స్ క్లబ్, నీర్మాల స్మశానవాటికలో షెడ్ ప్రారంభం

జనగామ ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 26 (ప్రజావాణి):జిల్లాలోని దేవరుప్పుల మండలం, నీర్మాల గ్రామంలోని స్మశానవాటికలో షెడ్ ను లయన్ యాడ్మా సంజీవరెడ్డి – సుగుణ దంపతుల దాతృత్వంతో వారి తల్లిదండ్రుల పేరిట నిర్మించారు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం చేసిన ఈ సేవా కార్యక్రమం గ్రామస్తులందరి మన్ననలు పొందింది.

నిర్మించిన షెడ్ ను లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నరహరి సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతలు సంజీవరెడ్డి – సుగుణ దంపతుల సేవా భావాన్ని కొనియాడారు. సేవే పరమావధిగా లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. తల్లిదండ్రుల పేరిట ఇలాంటి శాశ్వత నిర్మాణం చేపట్టడం ఎంతో అభినందనీయమని, ఇది ఇతరులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

గతంలో స్మశానవాటికలో షెడ్ లేకపోవడంతో అంత్యక్రియల సమయంలో గ్రామస్తులు ఎండకు, వానకు ఎంతో ఇబ్బంది పడేవారని గ్రామస్తులు తెలిపారు. ఇప్పుడు ఈ షెడ్ నిర్మాణంతో ఆ ఇబ్బందులు తొలగిపోతాయని, ఎండా వానల నుండి రక్షణ లభిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధిలో, సేవా కార్యక్రమాల్లో దాతల పాత్ర మరువలేనిదని అన్నారు.

ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ లయన్ జైన రమేష్, గ్రామ సర్పంచ్ సంధ్యారాణి, లయన్స్ క్లబ్ అఫ్ జనగామ అధ్యక్షులు రావెల రవి, పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్, మార్కెటింగ్ చైర్మన్ బజాజ్, లయన్ ఉప్పలయ్య, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దాతల దంపతులను గ్రామస్తులు, లయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని దాతలు తెలిపారు. గ్రామంలో సేవా భావం పెంపొందేలా లయన్స్ క్లబ్ కృషి చేస్తుందని నిర్వాహకులు తెలిపారు.