prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 8:55 pm Digital Edition : PRAJA VANI

రీ సర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

రీ సర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

*మన ప్రజావాణి*
*మంచిర్యాల జిల్లా*

భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం కొరకు ప్రభుత్వం రీ సర్వే చేపట్టిందని, ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లాలోని లక్షెట్టిపేట మండలం ఎల్లారం గ్రామంలో మండల తహసిల్దార్ దిలీప్ కుమార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనిల్ లతో కలిసి భూముల రీ సర్వే ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం భూముల రీ సర్వే చేపట్టి భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. భూ రీసర్వే చేపట్టే సమయంలో పాత రెవెన్యూ రికార్డులు, పహాణీలు, సెత్వార్, టిప్పన్, ఎఫ్.ఎం.బి., గ్రామ నక్షాలు, సర్వే నంబర్లు, భూముల విస్తీర్ణం, సబ్ డివిజన్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, రికార్డులలో ఉన్న వివరాలను క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులతో సరిపోల్చుకుంటూ సర్వే నిర్వహించాలని తెలిపారు ఎల్లారం గ్రామపంచాయతీలో ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం అమలు తీరును పరిశీలించారు. ఇప్పటి వరకు గ్రామంలో 84 దరఖాస్తుల నమోదు ప్రక్రియ పూర్తి అయిందని, అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మండలంలోని లింగాపూర్ గ్రామంలో కొనసాగుతున్న రీ సర్వే పనులను పరిశీలించి, సర్వే ప్రక్రియను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాన్ని సందర్శించి పాఠశాలలో నిర్మాణంలో ఉన్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. విద్యార్థులకు నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని, విద్యార్థుల ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. వంటశాల, భోజనశాలను సందర్శించి ఆహార నాణ్యత, సుబ్రతా నిబంధనల అమలును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.