మహిళకు సురక్షితమైన వాతావరణం లేని అభివృద్ధి నిజమైన అభివృద్ధే కాదు
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ
ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 25 అమరావతి
అన్ని రంగాల్లో మహిళలు ముందు వరుసలో ఉన్నప్పటికీ ఇప్పటికీ పురుషులే వ్యవస్థను నడిపిస్తున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు.
ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా నవంబర్ 25న నిర్వహించే మహిళలపై హింస నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్, ధర్మపీఠం సంయుక్త ఆధ్వర్యంలో మహిళా చట్టాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ శైలజ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, బాల్య దశ నుంచే పిల్లల ఆలోచనా దృక్పథాన్ని స్త్రీని గౌరవించేలా ఇంటి వద్దే తల్లిదండ్రులు తీర్చిదిద్దితే ఎలాంటి హింస చోటుచేసుకోకుండా నివారించవచ్చని అన్నారు.
హింస అంటే కేవలం శారీరకమైనది మాత్రమే కాదని, ఆన్లైన్ ద్వారా నేడు మహిళలపై మానసిక హింసకు పాల్పడుతున్న వారి చర్యలు క్షమించరానివని విమర్శించారు. మహిళలపై జరుగుతున్న శారీరక హింసను అరికట్టడానికి అనేక చట్టాలు ఉన్నప్పటికీ, వాటిపై మహిళలకు అవగాహన లేకపోవడం, అలాగే ఆ చట్టాలను సంపూర్ణంగా వినియోగించుకోలేకపోవడం వల్ల హింసను అరికట్టలేకపోతున్నామని అన్నారు.
నేటి పరిస్థితుల్లో ప్రతి మహిళ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడం ఒక జీవన నైపుణ్యమని రాయపాటి శైలజ అభివర్ణించారు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం క్షమించరాని చర్యగా ఆమె పేర్కొన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళల భద్రత కోసం శక్తి యాప్‌తో పాటు మహిళా పెట్రోలింగ్ ఏర్పాటు చేసి, ఆయా పోలీసు బృందాల ద్వారా ప్రతి జిల్లాలో మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం అభినందనీయమన్నారు. మహిళల రక్షణ కోసం 181 హెల్ప్‌లైన్‌తో పాటు అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం 112, అలాగే భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయాన్ని విద్యార్థులకు వివరించారు.
సభకు అధ్యక్షత వహించిన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, కామర్స్ అండ్ లా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ త్రిమూర్తులు మాట్లాడుతూ, విద్యాలయాల ద్వారా నిర్వహిస్తున్న అనేక మహిళా చైతన్య కార్యక్రమాలను మున్ముందు సమాజంలోని సామాన్య మహిళల వద్దకు కూడా తీసుకువెళ్లే బృహత్తర కార్యానికి ముందడుగు వేస్తామన్నారు. ధర్మపీఠం వంటి సేవా సంస్థలు మరిన్ని చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు.
గౌరవ అతిథిగా విచ్చేసిన విశ్వవిద్యాలయ రెక్టార్ ఆర్. శివరామ ప్రసాద్ మాట్లాడుతూ, మహిళ సమాజం తీరుకు ప్రతిస్పందించకుండా తాను ముందుకు దూసుకుపోగలిగిన నాడు మరిన్ని విజయాలను అందుకోగలదని ఆకాంక్షించారు. చట్టం తన పని తాను చేస్తుంది కాబట్టి మహిళ నిర్భయంగా అభివృద్ధి పథంలో పయనించాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రత్యేక అతిథిగా విచ్చేసిన విశ్వవిద్యాలయ సైకాలజీ విభాగపు ప్రొఫెసర్ విమల మాట్లాడుతూ, ప్రభుత్వం చట్టపరంగా అనేక రక్షణ కార్యక్రమాలను అందిస్తున్నప్పటికీ వాటిని అందుకునే స్థితిలో మహిళలందరూ లేరని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మహిళ మానసికంగా బలోపేతమైనప్పుడు వ్యక్తిగతంగా తాను దేన్నైనా ఎదుర్కొని, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలదని వివరించారు.
కార్యక్రమ నిర్వాహకురాలు, సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఈ. భవాని మాట్లాడుతూ, విద్య అనేది కేవలం ఒక అర్హత మాత్రమే కాదని, అది మహిళల సాధికారతకు ఒక శక్తివంతమైన సాధనమని అభివర్ణించారు. ప్రతి మహిళ తన హక్కులను తెలుసుకొని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అలాగే ఆర్థిక స్వాతంత్ర్యాన్ని మహిళ సాధించిన నాడు, ఆమెపై జరుగుతున్న దాడులను, అన్యాయాలను ప్రతిఘటించే తత్వం అలవడుతుందని, తద్వారా హింసను నిర్మూలించవచ్చని భవాని పేర్కొన్నారు.
ధర్మపీఠం జాతీయ న్యాయ సలహాదారు గంటా సతీష్ కుమార్ మాట్లాడుతూ, ఆన్లైన్ ద్వారా మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు చెక్ పెట్టేందుకు ఎన్నో చట్టపరమైన విధానాలు ఉన్నాయని, వాటిని అవలంబిస్తే హింస తీవ్రతను ప్రాథమిక దశలోనే తగ్గించుకోవచ్చని వివరించారు. మహిళలకు సంబంధించి చట్టం కల్పిస్తున్న అనేక రక్షణ అంశాలపై తాను పరిశోధన నిర్వహించి రూపొందించిన పత్రాలను సమావేశానికి హాజరైన విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు.
అలాగే ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన వారికి ధర్మపీఠం తరఫున అధ్యక్షులు శెట్టిపల్లి శశికిరణ్ నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ మహిళా ప్రొఫెసర్లు, మాజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం. సురేష్ కుమార్, ధర్మపీఠం కార్యవర్గ సభ్యులు సంపతి సంతోష్ కుమార్, తాళ్లూరి ప్రహర్షిత, యర్రంశెట్టి శ్రీనివాస్, విశ్వవిద్యాలయ విద్యార్థినులు హర్షిత, నేహా తదితరులు పాల్గొన్నారు.