డిసెంబర్ 9 ‘చలో హైదరాబాద్’కు సంపూర్ణ మద్దతు!
• లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేందుకు జ్యుడీషియల్ కమిషన్ వేయాలి
• 50 ఏళ్లుగా ఆదివాసీల విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లకు తీవ్ర అన్యాయం
• తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూనెం రామచంద్రరావు డిమాండ్
వెంకటాపురం (నూగురు), నవంబర్ 26 (మన ప్రజావాణి): తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ నాయకత్వంలో డిసెంబర్ 9న నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్’ బహిరంగ సభకు తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గురువారం వెంకటాపురం మండల కేంద్రంలోని కొమరం భీం సెంటర్లో పొడియం సురేష్ అధ్యక్షతన ఆ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.
జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలి:
ఈ సందర్భంగా తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూనెం రామచంద్రరావు మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు గడుస్తున్నా ఆదివాసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 1976లో లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చినప్పటి నుంచి గడచిన 50 ఏళ్లుగా అసలైన ఆదివాసీల హక్కులు, రిజర్వేషన్లు కోల్పోతున్నారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో ఓబీసీలుగా కొనసాగుతున్న లంబాడీలు తెలంగాణలో ఎస్టీలుగా ఎలా కొనసాగుతున్నారో ప్రభుత్వాలు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.చలో హైదరాబాద్‌ను జయప్రదం చేయాలి:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని, లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించి ఆదివాసీలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పోరాటంలో ఆదివాసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తక్షణమే గళం విప్పాలని కోరారు. డిసెంబర్ 9న హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభకు గ్రామ గ్రామాన ఆదివాసీలు, మహిళలు, యువకులు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ములుగు జిల్లా అధ్యక్షుడు పూనెం మునీశ్వరరావు, మండల అధ్యక్షుడు ఉండం రామచంద్ర ప్రసాద్, నాయకులు సోలం సుధాకర్, కోరం ప్రసాద్, సోలం చంటిబాబు, మడకం సంజయ్ కుమార్, తురుస రాజు, పూనెం పవన్ కుమార్, శ్యామల మహేష్, కాక ప్రశాంత్, పొడెం సురేష్ తదితరులు పాల్గొన్నారు.