prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 8:48 am Digital Edition : PRAJA VANI

జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి

జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి
డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఖమ్మం జిల్లాలో ఆందోళనలు
ఈనెల 30న కలెక్టరేట్ ఎదుట ధర్నా – అజ్మీరా రామ్మూర్తి నాయక్
కూసుమంచి నవంబర్ 26 (మన ప్రజావాణి) ప్రతినిధి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహమ్మద్ మౌలానా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
బుధవారం కూసుమంచి మండల పరిధిలోని గైగోళ్లపల్లి గ్రామంలో సీపీఐ మండల కార్యదర్శి భూక్య నరసింహ అధ్యక్షతన నిర్వహించిన మండల కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డిసెంబర్ 1న ఖమ్మం కలెక్టరేట్ ఎదుట, 2న కల్లూరు డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం ఎదుట, 3న ఖమ్మం ఆర్డీఓ కార్యాలయం ఎదుట జైల్ భరో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం సంపన్నులు, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోందని ఆయన ఆరోపించారు.
అదేవిధంగా డిసెంబర్ 27 నుంచి 29 వరకు ఖమ్మం నగరంలో నిర్వహించనున్న మహిళా సమాఖ్య రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. డిసెంబర్ 27న జరిగే మహా ప్రదర్శనలో మహిళలు, యువతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీరా రామ్మూర్తి నాయక్ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన కరవు పరిస్థితులను నిరసిస్తూ ఈనెల 30న ఖమ్మం కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న ధర్నాకు జిల్లాలోని గిరిజన తండాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం 2027 సంవత్సరానికి సంబంధించిన సీపీఐ సభ్యత్వ నమోదు, పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ సభ్యత్వాలను మహమ్మద్ మౌలానాకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సీనియర్ నాయకుడు కత్రోజు పాండురంగాచారి, సీపీఐ జిల్లా సమితి సభ్యులు గుండెపంగు మల్లేష్, జిల్లా లింగయ్య, తెలంగాణ గిరిజన సమాఖ్య మండల అధ్యక్షుడు వీరన్న, గైగోళ్లపల్లి గ్రామశాఖ కార్యదర్శి తేలు పిచ్చయ్య, సంధ్యాతండా గ్రామశాఖ కార్యదర్శి భూక్య మంగ్య, నాయకులు భూక్య పీక్ల, కొరట్ల సత్యం, జిల్లా రామచంద్రు, జిల్లా మైసయ్య, కొరట్ల శ్రీను, అల్లి ఏలాద్రి, జిల్లా మల్సూరు, భూక్య చిరంజీవి, భూక్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.