**కుళ్లిన పండ్లతో జ్యూస్ విక్రయాలు.. బారిస్టా కేఫ్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా!**
హనుమకొండ:ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న బారిస్టా జ్యూస్ కేఫ్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు. బాలసముద్రంలోని బారిస్టా జ్యూస్ కేఫ్‌లో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుళ్లిన పండ్లు, అపరిశుభ్ర వాతావరణం, తుప్పుపట్టిన యంత్రాలతో జ్యూస్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా 2022 ఏప్రిల్‌లోనే గడువు ముగిసిన లైసెన్స్‌తో వ్యాపారం కొనసాగిస్తున్నట్లు నిర్ధారించారు.
ఈ సందర్భంగా సేకరించిన సేవ్, పామాయిల్ నమూనాలను ప్రయోగశాలకు పంపించారు. కేఫ్ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశిస్తూ నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ తనిఖీల్లో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి, ఫుడ్ సేఫ్టీ అధికారి బ్రహ్మాజీతో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు.