*కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతల కుట్రతోనే నాపై అక్రమ కేసులు*
*కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదు*
*తెరవెనుక కుట్రదారుల బాగోతాన్ని త్వరలోనే ఆధారాలతో బయటపెడతా*
*ప్రజల అండ ఉన్నంత కాలం నా ప్రయాణం ఆగదు: సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి*
జహీరాబాద్, నవంబర్ 26 (ప్రజావాణి): న్యాయం గెలిచింది, అన్యాయం ఓడింది. నన్ను ఎంత అణగదొక్కాలని ప్రయత్నిస్తే అంతకు మించి పైకి ఎదుగుతాను. కుట్ర పూరిత కేసుల్లో జైలుకు వెళ్లి, రాజకీయ ఒత్తిళ్లకు ఏమాత్రం తలొగ్గకుండా ధైర్యంగా బయటకు వచ్చిన ఓ నాయకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల అండ ఉన్నంత కాలం తన పోరాటం ఆగదని, తన ప్రయాణం ఆగదని ఆయన ఉద్ఘాటించారు. తనపై జరిగిన కుట్రలకు త్వరలోనే ఆధారాలతో సమాధానం చెబుతానని అల్గొల్ సర్పంచ్ చల్ల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ముగ్గురు నేతల కుట్ర ఇది అని,
తన ఎదుగుదలను ఓర్వలేని కొందరు నాయకులు పథకం ప్రకారం తనపై అక్రమ కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు. ఈ నెల (నవంబర్) 9వ తేదీన అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు బడా నాయకులతో పాటు, బీజేపీకి చెందిన ఓ నాయకుడు, అలాగే బీఆర్ఎస్ పార్టీలోని మరో నాయకుడు వీరంతా ఏకమై తనపై కుట్రలు చేసి కేసులతో జైలుకు పంపించారని ఆయన మండిపడ్డారు. అయినప్పటికీ, తనపై ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటికి తలొగ్గకుండా ధైర్యంగా పోరాడి నవంబర్ 21న జైలు నుంచి సగర్వంగా బయటకు వచ్చినట్లు ఆయన వెల్లడించారు.
ఆధారాలతో బాగోతం బయటపెడతానని అన్నారు.