prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 5:42 pm Digital Edition : PRAJA VANI

ఎల్‌నినో ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ఎల్‌నినో ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

రైతు వ్యతిరేక అమెరికా–భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలి

రైతు సమస్యల పరిష్కారం కోసం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, నవంబర్ 26:

ఎల్‌నినో ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, రైతులకు నష్టం కలిగించే అమెరికా–భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు ఇతర దేశాలతో చేసుకున్న వ్యవసాయ, వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

గురువారం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు కూలీ సంఘం (ఆర్‌సీఎస్), తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్), భారత కమ్యూనిస్టు పార్టీ, అఖిల భారత రైతు కూలీ సంఘం, రైతు కార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ బి. శ్రీరాములుకు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం (ఆర్‌సీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెల్తురు సదానందం మాట్లాడుతూ.. 2021లో రైతు వ్యతిరేక నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేసే సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రాతపూర్వక హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లఖింపూర్ ఖేరీ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధిత రైతు కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరారు.

ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగం తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని, రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి బాధిత రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరి సాగు చేయవద్దని, ఆరుతడి పంటలు సాగు చేయాలని ప్రభుత్వం సూచించడం వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టే చర్యగా అభివర్ణించారు.

అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు మెరుగు చంద్రగౌడ్ మాట్లాడుతూ.. కౌలు రైతులను ప్రభుత్వం గుర్తించి వారికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని కోరారు. రైతులు పండించిన అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

భారత కమ్యూనిస్టు పార్టీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భారత వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. సారవంతమైన వ్యవసాయ భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తూ రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తోందన్నారు. రైతులకు తీవ్ర నష్టం కలిగించే అమెరికా–భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు ఇతర దేశాలతో చేసుకున్న వ్యవసాయ, వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రజా ఫ్రంట్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుమ్మడి కొమురయ్య మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. రైతుల సుదీర్ఘ ఉద్యమం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటికీ అమలు చేయకపోవడం దారుణమన్నారు. రైతు ఉద్యమంలో 765 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోవడం విచారకరమన్నారు. రైతాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధానాలను తిప్పికొట్టేందుకు రైతులు ఐక్యంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.

రైతుల సమస్యలను పరిష్కరించాలని, పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలని, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నాయకులు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు గుండేటి మల్లేశం, తుళ్ల గట్టయ్య, ఎస్. రాజేశ్వరరావు, ఈ. బాబు, గుండు రాజయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రేణిగుంట్ల ప్రీతం తదితర రైతు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.