అన్నదాతల గొంతు కోస్తున్న నకిలీ ఎరువుల మాఫియా!
• ‘మహాధన్’ బ్రాండ్ ముసుగులో యథేచ్ఛగా నకిలీ దందా
• వెంకటాపురం మండలంలో నిండా మునిగిన మిర్చి రైతులు
• అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా పట్టించుకోని అధికారులు
• విజిలెన్స్ దాడులు చేపట్టి అక్రమార్కులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్
వెంకటాపురం (ములుగు జిల్లా), (ప్రజావాణి) నవంబర్ 26:
ఆరుగాలం కష్టించి, రక్తాన్ని చెమటగా మార్చి పంటలు పండించే అన్నదాతల జీవితాలతో నకిలీ ఎరువుల మాఫియా చెలగాటమాడుతోంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ప్రముఖ ‘మహాధన్’ కంపెనీ బ్రాండ్ పేరుతో నకిలీ, నాసిరకం ఎరువులను విక్రయిస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్న వైనం కలకలం రేపుతోంది.
పెట్టుబడి బూడిదపాలు.. కన్నీటిసంద్రంలో రైతులు:ఎకరాకు లక్షల రూపాయలు అప్పులు చేసి మరీ మిర్చి సాగు చేస్తున్న రైతులు, అసలు ఎరువులని నమ్మి స్థానిక దుకాణాల్లో మహాధన్ బ్రాండ్ ఎరువులను కొనుగోలు చేశారు. తీరా పంటకు వేసిన తర్వాత మొక్కల్లో ఎదుగుదల లేకపోగా, ఆకుముడత, వేరుకుళ్లు వంటి సమస్యలతో పంట పూర్తిగా దెబ్బతిని నిలువునా ఎండిపోతోంది. నాణ్యత లేని నకిలీ ఎరువుల వల్లే తమ పంట నాశనమైందని, పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని బాధిత రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
అధికారుల నిఘా ఎక్కడ?
మండలంలో ఇంత పెద్ద ఎత్తున నకిలీ ఎరువుల దందా సాగుతున్నా, స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేయకపోవడం, బిల్లులు లేకుండా అధిక ధరలకు విక్రయిస్తున్నా పట్టించుకోకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల ఉదాసీనత వల్లే అక్రమార్కులు బరితెగించి రైతుల ఉసురు పోసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
రైతుల ప్రధాన డిమాండ్లు:
• నకిలీ ఎరువులను విక్రయిస్తున్న దుకాణాల లైసెన్సులను తక్షణమే రద్దు చేసి, బాధ్యులపై(పీడీ) యాక్ట్ కింద కఠిన కేసులు నమోదు చేయాలి.
• విజిలెన్స్ మరియు టాస్క్ఫోర్స్ అధికారులు రంగంలోకి దిగి మండలంలోని అన్ని ఎరువుల దుకాణాలు, గోదాములపై ఆకస్మిక దాడులు నిర్వహించాలి.
• నకిలీ ఎరువుల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి, ఆయా డీలర్లు మరియు కంపెనీల నుంచే నష్టపరిహారం ఇప్పించాలి.
తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయకపోతే, బాధిత రైతులందరం కలిసి రోడ్డెక్కి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వెంకటాపురం మండల రైతులు హెచ్చరిస్తున్నారు.