prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 2:02 pm Digital Edition : PRAJA VANI

అంబేద్కర్ ఆశయం కుల రహిత సమానత్వ సమాజం కౌన్సిలర్ మిండా హరిబాబు

*అంబేద్కర్ ఆశయం కుల రహిత సమానత్వ సమాజం కౌన్సిలర్ మిండా హరిబాబు*.

ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్ 26

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ పదవ వార్డు కౌన్సిలర్ మిండా హరిబాబు మాట్లాడుతూ, రాజ్యాంగం కేవలం పాలనా పత్రం కాదు… శతాబ్దాల సామాజిక అణచివేతపై ప్రజలు సాధించుకున్న హక్కుల ప్రకటన! అది అధికారానికి అలంకారం కాదు… అధికారాన్ని ప్రశ్నించే ప్రజల ఆయుధం! రాజ్యాంగాన్ని రక్షించుకోవడం అంటే స్వేచ్ఛను, సమానత్వాన్ని, లౌకికవాదాన్ని, సామాజిక న్యాయాన్ని, ప్రజాస్వామ్య భవిష్యత్తును కాపాడుకోవడమే!
ఒక దేశ గొప్పతనం దాని భూభాగ విస్తీర్ణంలోనో, సైనిక బలంలోనో, ఆర్థిక సంపదలోనో మాత్రమే ఉండదు. ఆ దేశంలో సామాన్య పౌరుడికి లభించే గౌరవంలో, పేదవాడికి దక్కే న్యాయంలో, అణగారిన వర్గాలకు కల్పించే అవకాశాల్లో, భిన్నాభిప్రాయాలను గౌరవించే ప్రజాస్వామిక సంస్కృతిలో ఉంటుంది. ప్రజలందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు, గౌరవప్రదమైన జీవితం కల్పించాలనే మహోన్నత ఆశయానికి ప్రతిరూపమే భారత రాజ్యాంగం.నవంబర్ 26 భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మైలురాయి. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఆమోదించింది. 1950 జనవరి 26 నుంచి అది అమలులోకి వచ్చింది. ఈ చారిత్రక సందర్భాన్ని స్మరించుకుంటూ 2015 నుంచి నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తున్నాం.వలస పాలన సంకెళ్లను తెంచుకుని స్వాతంత్ర్యం సాధించిన భారత ప్రజలకు రాజ్యాంగం ఒక నూతన దిశను చూపింది. రాజుల పాలనకు, వర్ణాధిపత్యానికి, కులవివక్షకు, సామాజిక అసమానతలకు ప్రత్యామ్నాయంగా ప్రజలే పాలకులు, ప్రజలే సార్వభౌమాధికారానికి మూలం అనే ప్రజాస్వామిక సూత్రాన్ని ప్రతిష్ఠించింది. అందుకే రాజ్యాంగం ఒక గ్రంథం మాత్రమే కాదు… భారత ప్రజల సామాజిక విముక్తి ఆకాంక్షలకు ప్రతీక
భారత రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పాత్ర అనన్యసామాన్యం. రాజ్యాంగ పరిషత్తు ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. కులవివక్ష, అంటరానితనం, సామాజిక అవమానాలను స్వయంగా అనుభవించిన అంబేద్కర్‌కు సమాజంలోని అసమానతల మూలాలు బాగా తెలుసు. అందుకే ఆయన దృష్టి కేవలం రాజకీయ స్వాతంత్ర్యానికే పరిమితం కాలేదు. ప్రతి మనిషికీ ఆత్మగౌరవం, సమాన హోదా, సామాజిక న్యాయం లభించే వ్యవస్థ నిర్మాణమే ఆయన ప్రధాన ఆకాంక్ష. రాజకీయ ప్రజాస్వామ్యం పునాదిగా సామాజిక ప్రజాస్వామ్యం ఉండాలని ఆయన ఆకాంక్షించారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పరస్పరం విడదీయరాని విలువలని చాటిచెప్పారు.
రాజ్యాంగం బతికితేనే ప్రజాస్వామ్యం బతుకుతుంది రాజ్యాంగాన్ని కాపాడుకుందాం… కుల, మత, ఆర్థిక అసమానతలను నిర్మూలిద్దాం… లౌకిక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం… స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పునాదులపై సామాజిక న్యాయ భారతాన్ని నిర్మిద్దాం!