prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 7:02 am Digital Edition : SRIKANTH MULUGU

లక్ష్మీదేవి పేటలో గుడుంబా గుప్పుమంటోంది –

ఎక్సైజ్ శాఖ నిద్రపోతోందా?

గుడుంబా తయారీకి అడ్డా అయిన లక్ష్మీదేవి పేట!

తాగేవాడు చెడుతున్నాడు, అమ్మేవాడు బాగుపడుతున్నాడు!

గ్రామం మొత్తం గుడుంబా మత్తులో – అధికారులు ఏం చేస్తున్నారు?

గుడుంబా మహమ్మారికి గ్రామమే బలి అవుతోంది!

* సమాచారం ఇచ్చినా స్పందించని ఎక్సైజ్ శాఖ – ప్రజల ఆగ్రహం!

కూలీ డబ్బులు గుడుంబా పాలు – కుటుంబాలు రోడ్డున!

తండాల్లో తయారీ, ఊళ్ళో విక్రయం – గుడుంబా దందా యథేచ్ఛ!

ఎక్సైజ్ శాఖ మేలుకోకపోతే, గ్రామమే మత్తులో మునుగుతుంది!
స్పందించని ఎక్సైజ్ శాఖ..పోలిస్ శాఖ.

ప్రజావాణి ములుగు జిల్లా ప్రతినిధి

వెంకటాపూర్, నవంబర్ 25

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవి పేట గ్రామంలో గుడుంబా దందా యథేచ్ఛగా సాగుతోంది. గ్రామంలోని గిరిజన తండాల్లో తయారవుతున్న గుడుంబా, గ్రామంలోని పలు విక్రయ కేంద్రాలకు చేరుతోంది.

గుడుంబా గ్రామంలో సులభంగా దొరుకుతుండటంతో యువతతో పాటు పలువురు కూలీలు మద్యానికి బానిసలవుతున్నారు. దీని వల్ల వారి ఆరోగ్యంతో పాటు, కుటుంబాల ఆర్థిక పరిస్థితి, సామాజిక జీవనం దెబ్బతింటోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అసలు బాధ ఏంటంటే సమాచారం ఇచ్చినా అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం వచ్చినప్పుడు మాత్రమే కాకుండా, నిరంతర నిఘా పెట్టి అక్రమ తయారీ కేంద్రాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు అంటున్నారు.

గుడుంబా తయారీ, విక్రయాలు గ్రామంలో మరింత విస్తరించకుండా సంబంధిత ఎక్సైజ్ అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేసి, అక్రమంగా గుడుంబా తయారు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, విక్రయ కేంద్రాలను గుర్తించి నియంత్రించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

గుడుంబా మహమ్మారిని అరికట్టడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యం మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.